National

జంతర్ మంతర్‌కు గుడ్‌బై..? దేశంలోనే అతిపెద్ద నిరసన వేదిక మారబోతుందా..!

రచన: Kashi6 నిమిషాల పఠనం

కేంద్ర ప్రభుత్వం కొత్త నిరసన వేదికను ఏర్పాటు చేస్తే, దశాబ్దాలుగా దేశ రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలిచిన జంతర్ మంతర్‌లో ఆందోళనలకు గణనీయంగా బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.

జంత‌ర్ మంత‌ర్ ఇక చ‌రిత్రేనా..?

ధ‌ర్నా వేదిక‌ను మార్చ‌బోతున్నారా..?

వేదిక‌ను మార్చాలంటూ సుప్రీంలో పిటిష‌న్

ప్ర‌త్యామ్నాయాలు వెతికే ప‌నిలో అధికారులు

ఉద్య‌మం, ఆందోళ‌న‌, నిర‌స‌న‌.. ఇలాంటివి ఏం చేయాల‌న్నా ముందుగా గుర్తొచ్చేది ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్. రైతులైనా, విద్యార్థులైనా, ఉద్యోగులైనా, రాజకీయ పార్టీలైనా తమ గళాన్ని దేశానికి వినిపించాలంటే ఇక్క‌డికే చేరుకుంటారు. ఢిల్లీలోని ఈ చారిత్రక ప్రదేశం ఎన్నో ప్రభుత్వాలను ఇబ్బందుల్లోకి నెట్టిన ఉద్యమాలకు సాక్షిగా నిలిచింది. కానీ ఇప్పుడు అదే జంతర్ మంతర్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో నిరసనలకు ప్రతీకగా మారిన ఈ వేదికకు ఇక బ్రేక్ పడబోతుందా? అనే చర్చ మొదలైంది.

ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేప‌ట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వ‌ద్ద జ‌రిగిన నిర‌స‌న ప్ర‌పంచ మీడియా దృష్టినే ఆక‌ర్షించింది. ఏకంగా కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. అయితే ఈసారి చర్చ ఉద్యమాల గురించి కాదు... ఉద్యమాల వేదికనే మార్చాలా? అన్న అంశంపై సాగుతోంది.

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో, రాష్ట్రపతి భవన్‌కు అత్యంత సమీపంలో ఉన్న జంతర్ మంతర్ దశాబ్దాలుగా ప్రజాస్వామ్య నిరసనలకు కేరాఫ్. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలనుకునే ప్రతి ఉద్యమం దాదాపు ఇక్కడే మొదలవుతుంది. అందుకే దీనిని భారత్‌లోని "ప్రొటెస్ట్ క్యాపిటల్" అని కూడా పిలుస్తుంటారు.

అయితే, తరచూ జరిగే ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనల వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం, నిత్యావసర సరుకుల రవాణాలో అంతరాయం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

సుప్రీం ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు చాలా ముఖ్యమైనవని పేర్కొంటూ, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా నిరసనలు నిర్వహించేలా ప్రత్యామ్నాయ వేదికను గుర్తించే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సోలిసిటర్ జనరల్‌ను కేంద్ర అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొత్త నిరసన వేదికను ఏర్పాటు చేస్తే, దశాబ్దాలుగా దేశ రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలిచిన జంతర్ మంతర్‌లో ఆందోళనలకు గణనీయంగా బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.

ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అందువల్ల ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసినా, అది ప్రజలకు సులభంగా చేరుకునేలా, ప్రభుత్వానికి తమ స్వరం వినిపించేలా ఉండాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజల హక్కులు, స్థానికుల సౌకర్యం... ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారు? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

ఒక్కటి కాదు... దేశంలో ఐదు జంతర్ మంతర్లు!

చాలామందికి జంతర్ మంతర్ అంటే ఢిల్లీ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ దేశంలో మొత్తం ఐదు జంతర్ మంతర్లు ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్, వారణాసి, మథుర, ఉజ్జయిని నగరాల్లో వీటిని నిర్మించారు. ఇవన్నీ ఖగోళ పరిశీలనల కోసం నిర్మించిన అద్భుతమైన శాస్త్రీయ కట్టడాలు.

వాటిలో జైపూర్ జంతర్ మంతర్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించగా, ఢిల్లీ జంతర్ మంత‌ర్‌ను జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించారు. శాస్త్ర విజ్ఞానానికి ప్రతీకగా నిర్మించిన ఈ ప్రదేశం... కాలక్రమేణా భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా మారడం విశేషం.

ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. జంతర్ మంతర్‌లో నిరసనలకు నిజంగానే గుడ్‌బై చెప్పాల్సి వస్తుందా? లేక ప్రజాస్వామ్య ఉద్యమాలకు అదే చిరునామాగా కొనసాగుతుందా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది.

#Jantar Mantar#Supreme Court#Jantar Mantar protests#Delhi protests#Protest venue#NEET protest#NEET paper leak#Parliament Street#Delhi news#India news#Supreme Court hearing
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి