Health

Health: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు... అది టైఫాయిడ్ హెచ్చరిక కావచ్చు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

మూడు రోజులకుపైగా జ్వరం కొనసాగినా, లేదా పై లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైన రక్త పరీక్షలు చేసి, వైద్యుడు నిర్ధారించిన తర్వాత మాత్రమే సరైన చికిత్స ప్రారంభించాలి.

జ్వరం వచ్చింది అంటే చాలామంది అది సాధారణ వైరల్ ఫీవర్ అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అదే జ్వరం రోజురోజుకూ పెరుగుతూ, శరీరం కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇస్తే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే అది టైఫాయిడ్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్. ఇది ప్రధానంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. సరైన సమయంలో గుర్తించకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

ఇక టైఫాయిడ్‌లో కనిపించే ముఖ్య లక్షణం క్రమంగా పెరుగుతూ ఉండే జ్వరం. మొదట తక్కువగా ప్రారంభమైన జ్వరం, కొన్ని రోజుల్లోనే 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉంటుంది. సాధారణ వైరల్ జ్వరంతో పోలిస్తే ఇది ఎక్కువ రోజులు కొనసాగుతుంది.

అలాగే, తీవ్రమైన తలనొప్పి, ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని అలసట, శరీరం మొత్తం బలహీనంగా అనిపించడం కూడా ప్రారంభ సంకేతాలుగా భావిస్తారు. మరోవైపు ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, వికారం, కొన్నిసార్లు వాంతులు కూడా రావచ్చు.

కొంతమందికి మలబద్ధకం, మరికొందరికి విరేచనాలు కనిపించవచ్చు. ఈ రెండు లక్షణాలూ టైఫాయిడ్‌లో సాధారణంగానే కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కారణం లేకుండా పొడి దగ్గు కూడా ఉండొచ్చు. ఇంకా కొంతమందిలో ఛాతీ లేదా పొట్టపై లేత గులాబీ రంగు చిన్న మచ్చలు కనిపించవచ్చు.

ఇవి అందరిలో కనిపించకపోయినా, వైద్యులకు టైఫాయిడ్‌ను గుర్తించడంలో ఉపయోగపడే సంకేతాల్లో ఒకటి. అయితే, ఈ లక్షణాలు కనిపించాయంటే తప్పనిసరిగా టైఫాయిడ్ అని అర్థం కాదు. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ వంటి ఇతర వ్యాధుల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.. అందుకే స్వయంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రమాదకరమని సూచిస్తున్నారు..

మూడు రోజులకుపైగా జ్వరం కొనసాగినా, లేదా పై లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైన రక్త పరీక్షలు చేసి, వైద్యుడు నిర్ధారించిన తర్వాత మాత్రమే సరైన చికిత్స ప్రారంభించాలి. పూర్తి కోర్సు మందులు వాడితే ఎక్కువ మంది పూర్తిగా కోలుకుంటారని తెలుపుచున్నారు..

ఇక టైఫాయిడ్‌ను నివారించాలంటే శుభ్రమైన నీరు తాగడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, భోజనం ముందు, అలాగే టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాట్లు తప్పనిసరని వైద్యులు పేర్కొంటున్నారు.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Typhoid Alert#Salmonella Typhi#symptoms#ignore#warning
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి