సాధారణంగా మనుషులు ఒంటరిగా ఉన్నామని... ఎవరూ చూడటం లేదని... మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తారు.. తాము సీక్రెట్ గా చేసే తప్పులు ఎవరికీ తెలియవనే భ్రమలో బ్రతికేస్తారు.. కానీ సనాతన ధర్మం మాత్రం అలా చెప్పడం లేదు.. మనిషి చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని విశ్వ చైతన్యంలో నమోదు అవుతుందని పేర్కొంటుంది.
శాస్త్రాల ప్రకారం మన కర్మలకు 18 మంది సాక్షులు ఉంటారని చెప్పబడింది. అవే నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యమధర్మరాజు, ఉభయ సంధ్యలు, సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి. వీటిని అష్టాదశ మహా సాక్షులు అని కూడా పేర్కొంటారు.
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. వీరు కోర్టులో సాక్ష్యం చెప్పే వ్యక్తులు కారు. ఇవి విశ్వనియమానికి ప్రతీకలు. మన జీవితం ప్రకృతి, ధర్మం, కాలం, మన అంతరాత్మ ముందు ఎప్పుడూ దాచలేనిదని చెప్పడానికి శాస్త్రాలు ఈ భావనను ప్రతిపాదించాయి. అందులో ముఖ్యమైనది అంతరాత్మ..
ప్రపంచమంతా మనల్ని క్షమించినా... మన అంతరాత్మ తప్పు చేశావని చెబితే ఆ బాధ నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే ధర్మశాస్త్రాలు అంతరాత్మనే మొదటి న్యాయమూర్తిగా భావిస్తాయి. అలాగే పంచభూతాలు... భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. మన జీవితం వీటి మధ్యే సాగుతుంది. ప్రకృతిని గౌరవించినవారికి ప్రకృతి సహకరిస్తుంది. దానిని నాశనం చేసినవారికి అదే ప్రకృతి హెచ్చరికగా నిలుస్తుంది. ఇదీ కర్మ సిద్ధాంతం చెప్పే సందేశం.
ఇక సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి, సంధ్యాకాలాలు... ఇవన్నీ కాలానికి ప్రతీకలు. కాలం ఎప్పుడూ ఆగదు. మనం చేసిన ప్రతి పనికి సరైన సమయంలో తగిన ఫలితం అందుతుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే కర్మ తప్పదు.. కాలం మరిచిపోదు అనే మాటలు పుట్టాయి. అయితే కర్మఫలం అంటే కేవలం వచ్చే జన్మలో అనుభవిస్తామని అనుకోవడం అవగాహన లేని విషయంగా పండితులు పేర్కొంటున్నారు..
గరుడ పురాణం, భగవద్గీత వంటి గ్రంథాల ప్రకారం కొన్ని కర్మలు వెంటనే ఫలిస్తాయి... కొన్ని కాలానుగుణంగా... మరికొన్ని భవిష్యత్తులో అనుభవించాల్సి వస్తుంది. అది పరమాత్మ నిర్ణయించిన విశ్వనియమం అని చెబుతున్నారు.. అందుకే సనాతన ధర్మం చెప్పే గొప్ప సందేశం ఒక్కటే... ఎవరూ చూడకపోయినా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ప్రపంచం కంటే ముందు మన కర్మలను గమనించేది మన అంతరాత్మ... వాటికి ఫలితం ఇచ్చేది దైవమే.
అందుకే పెద్దలు, శాస్త్రాలు, పురాణాలు ఏం చెబుతాయంటే.. నవ్వుకుంటూ చేసిన పాపాలు.. ఏడ్చుకుంటూ అనుభవిస్తారని.. నువ్వు తెచ్చుకున్న కర్మని నువ్వే అనుభవిస్తున్నప్పుడు.. ఆ నిందను ఇతరుల మీదికి గాని, దైవం మీదికి గాని నెట్టడం ధర్మం కాదని.. దైవ నియమాల ప్రకారం జీవించే జీవితమే కర్మలను భస్మం చేస్తూ భగవంతునికి దగ్గర చేస్తుందని చెబుతున్నాయి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












