మన వంటింట్లో ప్రతిరోజూ కనిపించే కొత్తిమీరను చాలామంది కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఇందులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉండటంతో ఇది ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే సోషల్ మీడియాలో కనిపించేలా కొత్తిమీర కిడ్నీలు, లివర్‌ను పూర్తిగా డిటాక్స్ చేస్తుంది అనే వాదనలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. మన శరీరంలో లివర్, కిడ్నీలే సహజంగా డిటాక్సిఫికేషన్ పనిని నిర్వహిస్తాయి.
ఇక కొత్తిమీరలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, అలాగే కొంతమేరకు కాల్షియం, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కొంతవరకు రక్షించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
గుండె ఆరోగ్యం విషయానికి వస్తే... సమతుల్య ఆహారంలో భాగంగా కొత్తిమీరను తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటే. అయితే ఇది ఒక్కటే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది లేదా గుండె జబ్బులను నివారిస్తుంది అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవు..
ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ K ఇందులో ఉంటుంది. ఇది ఎముకల సాధారణ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కానీ కాల్షియం అవసరాన్ని పూర్తిగా కొత్తిమీరతోనే భర్తీ చేయడం సాధ్యం కాదు. సమతుల్య ఆహారం తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు.
అదేవిధంగా చర్మ సంరక్షణ విషయంలో కూడా కొత్తిమీర పని చేస్తుందని.. కొత్తిమీర పేస్ట్ ను, పసుపుతో కలిపి ముఖానికి రాసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అయితే అందరికీ ఒకేలా ఫలితం వస్తుందని చెప్పలేం. కొందరిలో అలర్జీ లేదా చర్మం చికాకు పడే అవకాశం ఉంటుంది.
అందుకే ముందుగా చిన్న భాగంలో పరీక్షించి, అవసరమైతే చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే పీరియడ్స్ నొప్పి, జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు కొత్తిమీరను ఇంటి చిట్కాగా మాత్రమే చూడాలి. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదని పేర్కొంటున్నారు.
మొత్తానికి... కొత్తిమీర ఒక ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పోషకాలు లభిస్తాయి. కానీ దీనిని అద్భుత ఔషధంగా లేదా అన్ని వ్యాధులకు పరిష్కారంగా భావించడం మాత్రం సరైంది కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా నీరు తాగడం, అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించడం... ఇవే మంచి ఆరోగ్యానికి అసలైన సూత్రాలని తెలియచేస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












