- కరువు కొనసాగి ప్రభుత్వం పడిపోయేలా హరీశ్ పూజలంటూ సామ ప్రెస్‌మీట్
- భుజాలు తడుముకుంటూ రేవంత్ రెడ్డే చేశారని ఎమ్మెల్సీ శ్రవణ్ కౌంటర్
- లోకల్ లీడర్స్‌తో తిట్టించిన హరీశ్ రావు
- సీఎం కావాలంటే ఆ పూజలతో అయిపోతారా?
- 10 ఏండ్లు వందల కోట్లు అక్రమంగా మింగిన వాళ్లను అంత ఈజీగా ప్రజలు మర్చిపోతారా?
- వాళ్లు ఆ పూజలతోనే అధికారంలోకి వచ్చారనే భ్రమలో మీరు వస్తారు అంటే.. కౌంటర్ పీసీ అవసరమా?
- పూజల ప్రెస్ మీట్లపై లీగల్ నోటీసులు పంపించిన హరీశ్ రావు
- తెలంగాణలో గుడులు, పూజల రాజకీయాలపై స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
పూజలు, క్షుద్ర, తాంత్రిక పూజలపై సోమవారం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారింది. క్షుద్ర పూజల ప్రచారం పైనే నేతలు దృష్టి సారించారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై ముందుగా సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరుసగా పూజలు నిర్వహిస్తున్నారని, ఇవి ముమ్మాటికీ క్షుద్ర పూజలు అంటూ కాస్త ఘాటుగా విమర్శించారు.
దీనికి హరీశ్ రావు తనదైన రీతిలో ముందుగా పార్టీ లీడర్లతో నాలుగు తిట్లు తిట్టించి తర్వాత లాయర్‌తో లీగల్ నోటీసులు పంపించారని ఎద్దేవా చేశారు.. దీంతో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష నేతల రాజకీయ తీరుపై తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది.
హరీశ్ రావు పూజల టూర్స్
సాధారణంగా ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రం ప్రభుత్వం కూలిపోవాలని, రాష్ట్రంలో కరువు కొనసాగాలని కోరుతూ క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
మార్చి 2న తమిళనాడులోని తిరుచిరాపల్లి, మే 31 నుంచి జూన్ 1 వరకు కర్ణాటకలోని శివమొగ్గ, జూన్ 20న తిరుచ్చిలో జయగోరి కాళీ పూజలు, జూలై 23న మళ్లీ శివమొగ్గలో క్షుద్ర పూజలు నిర్వహించారని ఆయన ఆరోపించారు.
అధికారంలో లేకపోవడంతో తెలంగాణలో కరువు రావాలని, రైతులు నష్టపోవాలని, ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దాసోజు శ్రవణ్ కౌంటర్
సామ వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు శివమొగ్గ(కొల్లూరు) మూకాంబికా అమ్మవారి ఆలయం, శృంగేరి పీఠం వంటి పవిత్ర క్షేత్రాలకు వెళ్లి కుటుంబంతో పూజలు చేస్తే వాటిని “క్షుద్ర పూజలు” అని చిత్రీకరించడాన్ని తప్పుపట్టారు.
మూకాంబికా దేవి శక్తి స్వరూపిణి. ఆమెను రాజకీయాల్లోకి లాగి అపహాస్యం చేయడం సరికాదన్నారు. ఒక అడుగు ముందుకేసీ రేవంత్ రెడ్డి కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారని బయట వదంతులు ఉన్నాయన్నారు. సొంత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ప్రభావం తగ్గించడానికి, పదవి కోసం చేస్తున్నారంటూ ఆరోపించారు..
హరీశ్ గ్యాంగ్ హెచ్చరికలు.. లీగల్ నోటీసులు
హరీశ్ రావుపై విమర్శలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట నుంచి హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్ వరకు వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.
పూజలు వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన అంశమని, వాటిని రాజకీయ వివాదంగా మార్చడం సరైంది కాదని బీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి. మరోవైపు, ఈ పూజల వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. సీఎం పదవి కోసం హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోందనే ప్రచారం సాగుతోంది.
హిందూ దేవతలను పూజించడాన్ని వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీంతో తన పరువుకు భంగం కలుగుతోందని పేర్కొంటూ హరీశ్ రావు లీగల్ నోటీసులు జారీ చేశారు. అలాగే, సంబంధిత వీడియోలను ప్రసారం చేయవద్దని కూడా పలువురికి నోటీసులు పంపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూజలు, రాజకీయాలు, పరస్పర ఆరోపణలు కలిసి తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.












