ప్రస్తుత సమాజంలో అనుచిత పదజాలం మాట్లాడటాన్ని ఒక 'ట్రెండ్' లేదా 'కూల్'గా భావించే ధోరణి పెరిగిపోతుండటంపై భారత ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మను బాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల్లో కొందరు విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైన వేళ ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మాట్లాడే భాషే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుందని, బూతులు మాట్లాడటం వల్ల ఆధునికత గానీ, ఆత్మవిశ్వాసం గానీ రాదని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తూ, ఇతరులను గౌరవిస్తూ విజయం సాధించడమే అసలైన విజమని, తల్లిదండ్రులు, దేశం గర్వపడేలా నడుచుకోవడమే నిజమైన 'కూల్' అని యువతకు హితవు పలికారు.
అలాగే ఈ వివాదంపై ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే ఆ హక్కు ఇతరులను అగౌరవపరిచే స్థాయికి దిగజారకూడదని హితవు పలికారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకర పదజాలం ఉపయోగించడం బాధ్యతారాహిత్యమని, ఇది ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు, మర్యాదకు మధ్య ఉన్న రేఖను దాటకూడదని ఆయన గుర్తుచేశారు.
మరోవైపు నిరసనకారులను బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ 'గట్టర్ జనరేషన్' అని విమర్శించిన నేపథ్యంలో, నటుడు అశుతోష్ రాణా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. "సింహాలు గర్జిస్తాయి, కుక్కలు మొరుగుతాయి... వాటి శబ్దాన్ని బట్టే వాటి ఉనికి, గుర్తింపు ఆధారపడి ఉంటాయి" అని పేర్కొంటూ సంభాషణలో బాధ్యతాయుతమైన ప్రవర్తన ఎంత ముఖ్యమో గుర్తుచేశారు. మనం మాట్లాడే ప్రతి మాట సమాజంలో మనకు గౌరవాన్ని లేదా అవమానాన్ని తెచ్చిపెడుతుందని స్పష్టం చేస్తూ, బాధ్యతాయుతమైన పౌరులుగా మసలుకోవాలని సెలబ్రిటీలంతా యువతకు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే, విద్యార్థులు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా స్పందించారు. ఆ విద్యార్థులపై ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయకుండా, వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అయితే, ఇలాంటి ప్రవర్తనను సరిదిద్ది, యువతకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత మొత్తం సమాజంపైనే ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రధాని చూపిన ఈ ఉదారత, యువత తమ ప్రవర్తనను పునఃపరిశీలించుకోవడానికి ఒక అవకాశంగా మారాలని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.












