దీపం అంటే కేవలం వెలుగు కాదు... అది జ్ఞానానికి, పవిత్రతకు, దైవచైతన్యానికి ప్రతీక. అందుకే మన సనాతన ధర్మంలో దీపారాధన లేకుండా దేవతారాధన పూర్తి కాదు అని పెద్దలు చెబుతారు. ఇంట్లో వెలిగే ఆ చిన్న దీపం... మనసులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, ఆత్మలో భక్తి జ్యోతిని వెలిగిస్తుందని శాస్త్రాలు చెబుతాయి..
సాధారణంగా పూజా సమయంలో రెండు దీపపు కుందెలను ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఒక కుందెతోనైనా భక్తిశ్రద్ధలతో దీపారాధన చేయవచ్చు. కానీ అందులో మూడు వత్తులు కలిపి లేదా విడివిడిగా అయిన దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. అలాగే దీపపు కుందెలు ఎక్కువ ఉంటే.. ప్రతి కుందెలో రెండేసి వత్తులు ఉంచడం మంగళకరంగా చెబుతారు.
అదేవిధంగా ప్రతిరోజూ కాలిపోయిన వత్తులను తొలగించి, మిగిలిన నూనెను మార్చి, శుభ్రంగా కొత్త వత్తులతో దీపాన్ని వెలిగించడం పవిత్రతకు సంకేతంగా పరిగణిస్తారు. మరోవైపు చాలామంది ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన నూనె వేయాలని భావిస్తారు. కానీ ఆగమశాస్త్రాల్లో అలాంటి నియమం లేదని పండితులు చెబుతున్నారు. పూజామందిరంలో ఒకే రకమైన నూనెతో దీపారాధన చేయడం ఉత్తమంగా భావిస్తారు.
వీలైతే ఆవు నెయ్యితో వెలిగించే దీపం అత్యంత శ్రేష్ఠమైనదిగా చెప్పబడింది. అది సాధ్యం కాకపోతే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత మంగళకరంగా భావిస్తారు. నువ్వుల నూనె ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిదని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటాయి. అయితే వేరుశనగ నూనె, రిఫైన్డ్ ఆయిల్ లేదా డాల్డా వంటి పదార్థాలను దీపారాధనలో ఉపయోగించకూడదని సంప్రదాయం సూచిస్తోంది.
అదేవిధంగా పూజ చేసే సమయం కూడా ఎంతో ముఖ్యమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి.. ఉదయాన్నే ప్రకృతి ప్రశాంతంగా, మనసు నిర్మలంగా ఉండే సమయం. అందుకే బ్రహ్మముహూర్తంలో లేచి యోగాసనాలు, స్నానం, జపం, ధ్యానం, స్తోత్రపఠనం చేయడం అత్యంత శ్రేయస్కరమని వేదాలు తెలియజేస్తాయి. సూర్యోదయ సమయంలో సంధ్యావందనం, ఆదిత్య హృదయం వంటి పారాయణాలు చేసి, అనంతరం దేవునికి పూజ, నివేదన, మంగళహారతి నిర్వహించడం సంపూర్ణ ఆరాధనగా భావిస్తారు.
ఇక పూజ పూర్తయ్యాక తీర్థప్రసాదాన్ని ముందుగా కుటుంబ సభ్యులకు, ఆ తర్వాత బంధుమిత్రులకు అందించడం వెనుక కూడా ఒక గొప్ప సందేశం ఉంది. భక్తి ఒక్కరికే పరిమితం కాకుండా కుటుంబమంతా దైవానుగ్రహాన్ని పంచుకోవాలనే భావన ఇందులో దాగి ఉంది.. దేవుడు కోరేది ఖరీదైన దీపాలు కాదు, విలువైన నూనెలు కాదు. భక్తితో నిండిన మనసు, పవిత్రమైన ఆలోచనలు, నిష్కపటమైన ప్రార్థనే నిజమైన పూజగా భావించబడుతుందని పండితులు అంటున్నారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












