టాప్ న్యూస్

High Alert: ప్రాణాంతక వైరస్ కలకలం.. గుజరాత్‌లో 22మంది చిన్నారులు మృతి!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

గుజరాత్‌లో వర్షాకాలం వేళ అరుదైన, ప్రాణాంతకమైన చండీపుర వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా అధికారికంగా ధృవీకరించారు.

గుజరాత్‌లో వర్షాకాలం వేళ అరుదైన, ప్రాణాంతకమైన చండీపుర వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 184 అనుమానిత కేసులు నమోదు కాగా, వాటిలో 35 మందికి చండీపుర వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మరో 11 నమూనాల నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ అంతటా అత్యవసర హెచ్చరికలు జారీ చేసి, వ్యాప్తి నిరోధానికి కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం చండీపుర వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులు వివిధ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతుండగా, మరో ఆరుగురు పిల్లలు పూర్తిగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. గాంధీనగర్, సబర్కాంత, పటాన్, రాజ్‌కోట్, భావ్‌నగర్ జిల్లాలలోని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నారు.

అయితే, నమోదవుతున్న కేసులన్నీ 15 సంవత్సరాల లోపు వయసున్న చిన్నారుల్లోనే వెలుగుచూడటం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మహమ్మారి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అనేక జిల్లాలకు విస్తరిస్తుండటంతో అధికార యంత్రాంగం నిఘాను తీవ్రతరం చేసింది. ఇసుక ఈగలు (సాండ్ ఫ్లైస్) కుట్టడం ద్వారానే ఈ చండీపుర వైరస్ ప్రధానంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. చిన్నారుల్లో తీవ్రమైన జ్వరం, వాంతులు, మూర్చ రావడంతో పాటు స్పృహ తప్పే లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని సూచిస్తున్నారు.

మొట్టమొదటిసారిగా 1965లో మహారాష్ట్రలోని చండీపుర ప్రాంతంలో వెలుగుచూసిన ఈ వైరస్, పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే బహుళ అవయవాల వైఫల్యానికి దారితీసి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. ఈ చండీపుర వైరస్‌కు నిర్దిష్టమైన వ్యాక్సిన్ గానీ, ప్రత్యేక యాంటీవైరల్ మందులు గానీ అందుబాటులో లేకపోవడంతో ముందస్తు నివారణ చర్యలే ఏకైక మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

#Chandipura Virus#Gujarat Health Alert#Sandfly Infection#Child Health News#Encephalitis Outbreak#Praful Pansheriya#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి