National

BJP: ఎమర్జెన్సీ వైద్య సేవలపై కేంద్రం కీలక నిర్ణయం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, కొండ మార్గాలు, అలాగే ట్రాఫిక్‌ ఉన్న సమయాల్లో నగర వీధుల్లోకి అంబులెన్స్ సమయానికి చేరుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఈ టూవీలర్ అంబులెన్సులు ఎంతో ఉపయోగపడనున్నాయి.

దేశంలో అత్యవసర వైద్య సేవల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై గ్రామీణ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఇరుకైన వీధులు ఉన్న ప్రాంతాల్లో ప్రాణాలను కాపాడేందుకు ద్విచక్ర వాహన అంబులెన్సులకు చట్టబద్ధ గుర్తింపు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989లో సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇప్పటివరకు దేశంలో కొన్ని రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు బైక్ అంబులెన్సులను ప్రయోగాత్మకంగా వినియోగించినా... వాటికి స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు లేవు. దీంతో రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు, రోగుల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టత లేకపోయింది. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన సవరణలతో ఈ సేవలు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రానున్నాయి.

ఇక ఈ ద్విచక్ర అంబులెన్సుల వల్ల గోల్డెన్ అవర్ లో ప్రాణాలను కాపాడడం. ప్రమాదం జరిగిన మొదటి గంటలో సరైన చికిత్స అందితే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, కొండ మార్గాలు, అలాగే ట్రాఫిక్‌ ఉన్న సమయాల్లో నగర వీధుల్లోకి అంబులెన్స్ సమయానికి చేరుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఈ టూవీలర్ అంబులెన్సులు ఎంతో ఉపయోగపడనున్నాయి.

ఈ వాహనాలు ఇరుకైన రోడ్లలో కూడా సులభంగా వెళ్లగలవు.. అలాగే ప్రమాద స్థలానికి త్వరగా చేరుకుని ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు, అవసరమైన ఆక్సిజన్, ఫస్ట్ ఎయిడ్, అత్యవసర వైద్య పరికరాలను వెంట తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. గర్భిణులు, గుండెపోటు బాధితులు, పాము కాటుకు గురైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి చికిత్స అందించడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.

కేంద్రం ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం ఎల్-2 కేటగిరీ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా ఉపయోగించనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రాంతాల్లోనే ఇవి సేవలు అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ముసాయిదాపై 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం వాటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. మొత్తానికి.. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువ అవుతాయనే ఆశాభావం వ్యక్తం అవుతుంది..

#National News#BJP government#emergency#medical services#two-wheeler#ambulances#permitted soon
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి