పోలీసుల మీద వరుసగా కేసులు అవుతున్నా కొందరి తీరు మాత్రం అస్సలు మారడం లేదు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.ఈ క్రమంలోనే తమను వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్‌వాడీ టీచర్లతో ఓ ఎస్ఐ దురుసుగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఆయన అలా చేయడంతో మనస్తాపం చెంది స్పృహ కోల్పోయి ఓ అంగన్‌వాడీ టీచర్ కింద పడిపోయింది.
వివరాల్లోకివెళితే.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా స్కూల్లో పనిచేస్తున్నాడు. అదే సమయంలో అంగన్ వాడీ టీచర్ల పర్సనల్ వీడియోలు, బాత్రూమ్‌కు వెళ్లే వీడియోలు తీసి వేధిస్తున్నాడు.ఇదే విషయాన్ని దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్‌కు ఈ నెల 1వ తేదీన బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు.
https://x.com/TeluguScribe/status/2084501281474052197?s=20
న్యాయం చేస్తానని నమ్మించిన ఎస్ఐ.. ఆ తర్వాత తమను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి,తాము ఫిర్యాదు చేసిన వ్యక్తి ముందే ఘోరంగా దూషిస్తూ అవమానించాడని అంగన్ వాడీ టీచర్లు ఆరోపించారు. నరేశ్ అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేసిన వారిలో అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి ఉన్నారు. తాము మహిళలు అని చూడకుండా ఎస్ఐ రవికుమార్ బూతులు తిడుతూ అవమానపరిచాడని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించాడని, తొక్కి చంపుతామని బెదిరించాడని పేర్కొన్నారు.ఎస్ఐ ప్రవర్తనతో తీవ్ర ఆవేదనకు గురై స్పృహ కోల్పోయిన మంజులను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలోనే తమను అవమానించిన ఎస్ఐను సస్పెండ్ చేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని, తొర్రూరు సీఐ గణేష్‌కు బాధితులు పిటిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎస్పీకి సైతం బాధితులు ఫిర్యాదు చేశారు. తమను అవమానించిన ఎస్ఐపై, బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న నరేష్ అనే వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.












