గ్రామపంచాయతీ నిధులను కొందరు అక్రమార్కులు బొక్కేస్తున్నట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా పంచాయతీ అభివృద్ది, ప్రజలకు సౌకర్యాలు అందించేందుకు ఖర్చు చేయకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ తమ జేబుల్లో నిధులను వేసుకుంటున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు ప్రజాప్రతినిధులు, అధికారులే మొత్తంగా గండి కొడుతున్నట్టు తెలుస్తోంది.
ప్రజాధనాన్ని దొంగ లెక్కలతో స్వాహా చేస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి గ్రామ పంచాయతీలో గత ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ‘డబుల్ జీతాల’ పేరిట డబ్బులు నొక్కేస్తున్నట్టు తెలిసింది.ఈ స్కాం ఆలస్యంంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒకే వ్యక్తి పేరు మీద రెండు వేర్వేరు ఉద్యోగాలు చూపిస్తూ ప్రతినెలా ప్రభుత్వ నిధులను ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు స్కామ్ చేస్తున్నట్టు తెలిసింది.
అయితే, జింకలపల్లి పంచాయతీలో ‘రవి’ అనే వ్యక్తి మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలోనే కొందరు స్థానిక నాయకులు, అధికారులు కలిసి పక్కా స్కెచ్ వేశారు. పంచాయతీ రికార్డుల్లో రవి పేరును ఓవైపు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్, మరోవైపు మిషన్ భగీరథ వాటర్‌మెన్‌గా నమోదు చేయించారు. ఇలా రవి పేరిట గత ఐదేళ్లుగా ప్రతినెలా రెండు ప్రభుత్వ జీతాలను విత్ డ్రా చేస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. వచ్చిన డబ్బుల్లో రవికి ఒక జీతం ఇస్తూ.. మిగతాది అధికారులు, ప్రతినిధులు తమ జేబుల్లో వేసుకుంటున్నట్టు తెలిసింది. ఈ స్కాంలో సర్పంచ్, మాజీ సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శుల హస్తం ఉన్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించి పంచాయతీ నిధులను కాపాడాలని జింకపల్లి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












