దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ పొలిటిషియన్, ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ జ్ఞానదేవ్ యశ్వంత్రెవ్ ( డీవై) పాటిల్ (90) కన్నుమూశారు. గతంలో ఇయన త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. వయోభార సమస్యల వలన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. డీవై పాటిల్ మృతి పట్ల త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సంతాపం వ్యక్తం చేశారు.
‘ప్రముఖ విద్యావేత్త, సంస్థల నిర్మాత, పద్మశ్రీ డాక్టర్ డి.వై.పాటిల్ మరణం విచారకరం. విద్య, వైద్యం, ప్రజాసేవ రంగాలలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఇదిలాఉండగా, 1935 అక్టోబర్ 22న జన్మించిన పాటిల్.. విద్యా రంగం, సామాజిక సంక్షేమానికి విశేష సేవలు అందించారు. ఆయన స్థాపించిన 'డి.వై. పాటిల్ గ్రూప్' ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 182కు పైగా విద్యాసంస్థలు, 7 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి.
ఇక ఆయన మహారాష్ట్రలో శాసనసభ్యుడిగా పనిచేశారు. అనంతరం 2009 నుంచి 2013 వరకు త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా విశేష సేవలందించారు. విద్యా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 1991లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. డివై పాటిల్ మృతి చెందిన విషయం తెలిసి దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.












