ఏపీ

AP: అనధికార లేఅవుట్లపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఏపీలోని అనధికార లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చే తీర్పును వెలువరించింది. గ్రామ పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) లేదనే ఏకైక కారణంతో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ నిరాకరించడం తగదని విద్యుత్ పంపిణీ సంస్థలను(డిస్కంలు) ఆదేశించింది.

ఏపీలోని అనధికార లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చే తీర్పును వెలువరించింది. గ్రామ పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) లేదనే ఏకైక కారణంతో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ నిరాకరించడం తగదని విద్యుత్ పంపిణీ సంస్థలను(డిస్కంలు) ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విద్యుత్ పొందే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుందని, ఆఖరికి ఆక్రమణదారులకు సైతం విద్యుత్ సరఫరా పొందే అర్హత ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్న వేలాది మందికి పెద్ద ఊరట లభించింది. ఈ వివాదం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రామానికి చెందిన గరికిన సత్యరావు పిటిషన్‌తో వెలుగులోకి వచ్చింది. ఆయన తన నూతన గృహానికి కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేయగా, పంచాయతీ కార్యదర్శి ఎన్ఓసీ ఇవ్వలేదనే నెపంతో ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) అధికారులు కనెక్షన్‌ను నిరాకరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్‌పై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు.

సేల్ డీడ్ ద్వారా స్థలాన్ని కొనుగోలు చేసి చట్టబద్ధంగా ఇల్లు నిర్మించుకున్న వ్యక్తికి పంచాయతీ అనుమతులు లేవనే సాంకేతిక కారణంతో విద్యుత్ నిలిపివేయడం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా నియమావళి ప్రకారం గృహాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ మౌలిక వసతిగా కరెంట్ పొందే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ దరఖాస్తును తక్షణమే పరిశీలించి, ఇతర అర్హతలు సక్రమంగా ఉంటే మూడు వారాల్లోగా కనెక్షన్ మంజూరు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

హైకోర్టు వెలువరించిన ఈ కీలక తీర్పు అనధికార లేఅవుట్లలో నివసిస్తూ విద్యుత్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక మంది ప్రజలకు మార్గం సుగమం చేసింది. భవిష్యత్తులో కూడా అధికారులు ఎన్ఓసీల పేరుతో సామాన్యులను వేధించకుండా ఉండేందుకు ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

#AP High Court#Electricity Connection#Andhra Pradesh News#AP High Court Order#APEPDCL#AP Local News#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి