తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రా అంశం హాట్ టాపిక్‌గా మారింది. హైడ్రా చీఫ్‌గా రంగనాథ్‌ను తక్షణమే తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.
ధర్మాసనం చెప్పినట్టే హైడ్రా తొమ్మిది తలల విషనాగులా మారిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థను ప్రజా ప్రయోజనాల కోసం కాదు, బ్లాక్‌మెయిల్ టూల్‌గా ఉపయోగిస్తోందని ఆరోపించారు. హైడ్రా పేరుతో భారీ దందాలు జరిగాయని.. ఆ వ్యవహారం వెనుక పెద్ద స్కామ్ ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
అంతేకాదు.. దేశ చరిత్రలో ఒక అధికారి 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఉదాహరణ ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా వేట కుక్కలా మారిందని విమర్శించారు. నిజంగా అక్రమ నిర్మాణాలపైనే చర్యలు తీసుకుంటే.. అధికార పార్టీ నేతల ఇళ్లు, ఫామ్‌హౌస్‌లపై ఎందుకు చర్యలు లేవని నిలదీశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రా వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తామని, బంగాళాఖాతంలో పారేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.. హైడ్రా అనే పేరు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పెట్టారు.. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువుల రక్షణ, నాలాల ఆక్రమణల తొలగింపు, విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థ ఉండాలనే ఆలోచన ప్రారంభమైందన్న విషయాన్ని కేటీఆర్ మరచినట్టు ఉన్నాడని ఎద్దేవా చేశారు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. కేసీఆర్, కేటీఆర్ అసెంబ్లీలో, విలేకరుల సమావేశాల్లో చెరువులు, నాలాల ఆక్రమణలపై కఠిన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.. 2016, 2020 హైదరాబాద్ వరదల సమయంలో.. నాలాలు, చెరువుల బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాల వల్లే నగరం ముంపునకు గురవుతోందని కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు. అలాగే చెరువుల FTL పరిధిలో, నాలాలపై దాదాపు 28,000 ఆక్రమణలు ఉన్నాయని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వీటిని కూల్చివేసే అధికారం అధికారులకు ఉందనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పినప్పుడు కేటీఆర్ నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు..
మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నాలాల అభివృద్ధికి SNDPని తీసుకువచ్చిన విషయాన్ని మరచిపోవడం విడ్డూరమని.. మూసీ పరివాహక ప్రాంతంలో, నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, అవసరమైతే వేలాది అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు నడిపించి నగర ప్రజలను వరదల నుంచి కాపాడాలని కూడా కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు సుద్దపూసలా అధికారం కోసం నకకజిత్తుల వేషాలు వేయడం ప్రజలు గమనిస్తున్నారని అధికారపక్ష నేతలు మండిపడుతున్నారు..
ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు వంటి ప్రజా ఆస్తులను ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే హైడ్రా. అక్రమ నిర్మాణాలను గుర్తించడం, ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. ప్రజా ప్రయోజనాలను కాపాడుతూ, ప్రభుత్వ ఆస్తులు ప్రజలకే ఉపయోగపడేలా చూడడమే హైడ్రా ఉద్దేశం. అయితే ఈ చర్యలు చట్టపరమైన నిబంధనలు, న్యాయస్థానాల మార్గదర్శకాల ప్రకారం అమలు కావడం అనేది ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్న వ్యవహారమని హైడ్రా పై తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న జనం అనుకుంటున్నారు..












