తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ రికార్డ్ సృష్టించింది. లంచగొండి అధికారులపై ఉక్కుపాదం మోపుతూ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఏసీబీ తన చరిత్రలోనే అరుదైన రికార్డును నమోదు చేసింది. 1983 తర్వాత నమోదు కానంత అవినీతి కేసులను 2026 రెండో త్రైమాసికం.. అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు..నమోదు చేసింది.
హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ వివరాలను ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా వెల్లడించారు. అవినీతిపై రాజీ పడకుండా.. నిరంతర నిఘా, కచ్చితమైన దర్యాప్తు, అధికారుల వృత్తి నిబద్ధత వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఏసీబీ అధికారులు, సిబ్బంది సమిష్టి కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
అవినీతి నిర్మూలనలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు తొలిసారిగా 'రివార్డ్ మేళా' నిర్వహించడం విశేషం. అత్యుత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేస్తూ వారి సేవలను గుర్తించారు. ఈ సందర్భంగా చారు సిన్హా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అవినీతి అనేది దేశాన్ని లోపల నుంచే బలహీనపరిచే ప్రమాదకరమైన సామాజిక శత్రువని ఆమె అన్నారు.
ప్రతి అధికారి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ఏసీబీ లక్ష్యం కేవలం కేసులు నమోదు చేయడం మాత్రమే కాదని.. ప్రతి కేసులో నిష్పాక్షిక, పారదర్శక, సమగ్ర దర్యాప్తు నిర్వహించి అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టడమేనని స్పష్టం చేశారు. అలాగే అధికారులకు నిరంతర శిక్షణ, దర్యాప్తు ప్రమాణాల మెరుగుదల, సంస్థాగత అప్రమత్తత ద్వారా అవినీతి నిరోధక చర్యలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.












