గత కొంత కాలంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పై జరుగుతున్న ప్రచారాలకు ప్రజా ప్రభుత్వం తెర దించింది. భవిష్యత్తులో బకాయిల సమస్య ఉండదని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇకపై ప్రతి సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. దిల్లీ లో ఉన్న ఆయన ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు..
బీఆర్ఎస్ హయాంలో రూ.8వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టారు. వారి నిర్లక్ష్యం ఇప్పుడు ప్రజా ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు.. ఈ అంశంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఆ పార్టీ ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడరు.. కానీ పదేపదే ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులకు మా ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అంతెందుకు ఆర్.కృష్ణయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీలో బకాయిలపై ఆయన ఎప్పుడైనా మాట్లాడారా?.. ఆ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది.. అక్కడి బకాయిలపై స్పందించి ఆ తర్వాత తెలంగాణ గురించి మాట్లాడితే బాగుంటుందని రేవంత్ రెడ్డి హితవు పలికారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ కొట్టేయాలని చూసిన సంస్థలపై కూడా విచారణ జరుగుతోందని తెలిపారు..
మరోవైపు తెలంగాణలో పరీక్షల నిర్వహణ వ్యవస్థపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్‌లైన్ పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తుతున్నాయని, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యాశాఖలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం క్రమంగా తన పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
విద్య వ్యవస్థ రాష్ట్రాల పరిధిలో బలంగా ఉంటేనే పారదర్శకత పెరిగి, ఇలాంటి తప్పిదాలు తగ్గే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా అవసరమైన సంస్కరణలు తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, పూర్తిస్థాయి పారదర్శకతతో నియామకాలు చేపట్టామని గుర్తుచేశారు.
విద్యార్థుల్లో నమ్మకం పెంచేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపిన రేవంత్ రెడ్డి.. గతంలో గ్లోబరీనా వంటి సంస్థలు తెలంగాణలో అక్రమాలకు పాల్పడినా, అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ ప్రభావం సీబీఎస్‌ఈ వరకు విస్తరించిందని ఆరోపించారు. ఇకపై అలాంటి సంస్థల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తోసమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ గృహ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అదనపు పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల ఆదాయం పెరిగేలా కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లు వంటి కొత్త పనులకు అనుమతులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి, లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించాలని సీఎం కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు...












