Japan Earthquake: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో జపాన్ లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికార వర్గాల సూచనలను పాటించాలన్నారు.
''జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమమోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం సముద్ర ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది'' అని జపాన్ వాతావరణ శాఖ (JMA) తెలిపింది.
భూకంపం కారణంగా పలు భవనాలు కూలి కొందరికి గాయాలయ్యాయని జపాన్ ప్రధాని సనాయె తకైచి తెలిపారు. ఒక మీటర్ ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని వీలైనంత త్వరగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం. అత్యవసర విపత్తులో మనుషుల ప్రాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరింది.
శక్తిమంతమైన భూకంపం ధాటికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సునామీ హెచ్చరికల జారీతో మరింత కంగారు పడుతున్నారు. ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
జూన్ 25న ఉత్తర జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరక్కపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" పశ్చిమ అంచున నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపై (భూఫలకాలపై) విస్తరించి ఉన్న జపాన్, ప్రపంచంలోనే అత్యధిక భూకంప క్రియాశీలత కలిగిన దేశాలలో ఒకటి. సుమారు 12.5 కోట్ల జనాభా కలిగిన ఈ ద్వీప సమూహంలో ఏటా వందలాది భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాలలో దాదాపు 18 శాతం ఇక్కడే నమోదవుతాయి.












