నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పార్లమెంట్ మార్చ్‌కు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునివ్వడంతో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, పోలీసులు లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు సహా హింసాత్మక ఘటనల్లో పాలు పంచుకున్న వారిని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..విద్యార్థులు నిరసన తెలిపే సమయంలో లాఠీచార్జి చేయడాన్ని తప్పుబట్టింది. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులపై పెట్టిన కేసులను సైతం ఉపసంహరించుకుని వెంటనే విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేర చరిత్ర లేని, నిరసనల్లో పాల్గొని అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. నేర చరిత్ర లేని విద్యార్థులపై ఎలాంటి బలవంతపు లేదా కఠిన చర్యలు తీసుకోకూడదని తెలిపింది.
ఇక సీజేపీ నిరసనల్లో చెలరేగిన హింస, పోలీసు దాడులపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై పారదర్శకంగా,నిష్పాక్షికంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన 'ప్రత్యేక విచారణ బృందం' (SIT) ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ ఘటనలపై స్పందించాలని కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం, తెలంగాణ సహా అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
ఇదిలాఉండగా, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. నిరసకారుల్లో 101 మందికి నేర చరిత్ర ఉందని, 62 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు కోర్టుకు వివరించారు. దాదాపు 250 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని, విద్యార్థుల నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడి హింసను ప్రేరేపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.












