రాష్ట్రంలో రోజురోజుకూ లంచగొండి అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాల కోసం చేయి చాచడం.. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఒకే శాఖకు పరిమితం కాకుండా.. ఈ అవినీతి వైరస్‌లా దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల్లో వ్యాపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన మరో ఘటన.. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయికి చేరుకుందో మరోసారి చర్చకు దారితీసింది.
కరీంనగర్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐ శ్రీకాంత్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు. వీరు పట్టుకున్న వాహనదారులను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తప్పించేందుకు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.
సుమారు 130 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.20 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు వీళ్లపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, కోర్టును కూడా తప్పుదారి పట్టించారని తెలుస్తుంది. వీళ్ళు పట్టుకున్న నిందితుల స్థానంలో ఇతర వ్యక్తులను కోర్టులో హాజరుపరిచినట్టు అధికారులు గుర్తించారట.. చట్టాన్ని అతిక్రమించి నడిపిన వీరి వ్యవహారం పై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు సమాచారం..
ఇక ఈ కేసులో ప్రాథమిక విచారణ నిర్వహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఐ శనిగల శ్రీకాంత్, కోర్టు డిస్పో జల్ కానిస్టేబుల్ సాయి, ట్రాఫిక్ స్టేషన్ రైటర్ కిరణ్ ను కరీంనగర్ జిల్లా సీపీ గౌస్ అలం, సస్పెండ్ చేసినట్టు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగు లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
మరోవైపు ఈ వ్యవహారం ముగ్గురికే పరిమితమా? ఈ స్కామ్ లో మరికొందరి పాత్ర కూడా ఉందా?.. గతంలో నమోదైన అన్ని డ్రంకెన్ డ్రైవ్ కేసులను తిరిగి పరిశీలిస్తారా?.. అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి..












