ఇటీవల కాలంలో సినీ హీరోలు పొలిటికల్ ఎంట్రీపై అమితంగా ఆసక్తి చూపుతున్నారు. తమిళనాడులో హీరో విజయ్ అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయిపోవడంతో ఆ ఆసక్తి సినీవర్గాల్లోని ప్రముఖులకు మరింత రెట్టింపు అయింది. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో తనదైన రీతిలో సినిమాలను చేస్తున్న హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. సినీ ఇండస్ట్రీలో ఇన్నాళ్లూ సంపాదించుకున్న ప్రజాదరణను, స్టార్‌డమ్‌ను ప్రజాసేవకే అంకితం చేయాలనే బలమైన నిర్ణయానికి ఆయన వచ్చినట్లు స్పష్టమవుతోంది.
సమయం, పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు అత్యంత నిజాయతీతో కూడిన సేవలందిస్తానని ఆయన ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం'తో తుపాను సృష్టించి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించగా, ఇటీవల ధనుష్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. తాజాగా విశాల్ కూడా ఆ బాటలోనే సాగుతుండడంతో తమిళ రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతోంది.
నాయకుల పనితీరు సరిగా లేనప్పుడే రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన అవసరం ఏర్పడుతుందని, అందుకే తన ప్రయాణం ఇకపై కేవలం వెండితెరకే పరిమితం కాదని విశాల్ కుండబద్దలు కొట్టారు. నడిగర్ సంగమ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బాధ్యతల్లో తనదైన ముద్ర వేయడమే కాకుండా, గతంలో ఆర్‌కే నగర్ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు ప్రయత్నించిన అనుభవం విశాల్‌కు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఆలోచనల వెనుక ఎలాంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.
తన అభిమాన సంఘాలను ఇప్పటినుంచే పూర్తిస్థాయి ప్రజాసేవ వైపు మళ్లించి, ప్రజల సమస్యలపై నేరుగా పోరాడేందుకు సిద్ధం చేస్తున్నారు.విశాల్ చేసిన ఈ ప్రకటన ఆయన పొలిటికల్ రీ-ఎంట్రీకి బలమైన సంకేతంగా నిలుస్తోంది. త్వరలోనే తన రాజకీయ పయనానికి సంబంధించిన పూర్తి ప్రణాళికను, వివరాలను వెల్లడిస్తానని ఆయన చెప్పడంతో.. సొంత పార్టీ ప్రకటన వెలువడుతుందా లేక బలమైన కూటమితో కలిసి సాగుతారా అనే అంశంపై రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.












