యువత పేరిట దేశాన్ని ముక్కలు చేసే కుట్ర జరుగుతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డుబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నదని వెల్లడించారు. దక్షిణ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. విద్యావంతులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో ప్రజలు మార్పుకోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రపంచంలో చాలా దేశాలు ముస్లిం, క్రిస్టియన్ దేశాలుగా మారాయని.. కానీ సనాతన ధర్మాన్ని ఎవరూ ఏం చేయలేకపోయారని గుర్తుచేశారు. దేశాన్ని విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, సనాతన ధర్మాన్ని ఎవరూ మార్చలేరని వ్యాఖ్యానించారు. యువతను వాడుకుని దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అమెరికా, దుబాయ్ లాంటి దేశాల నుంచి ఫండింగ్ వస్తున్నదని, దేశం ఐక్యత కాపాడాలంటే ప్రజలు అంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పారు.
సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్)పై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే సహించబోమని వెల్లడించారు. ‘సర్’ ప్రక్రియ ప్రతి పదేళ్లకూ ఒకసారి జరుగుతుందని, దానిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ఓటరు లిస్టులో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, సంక్షేమ పథకాలు పోతాయని సీఎం రేవంత్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం అంతా అవాస్తవం అన్నారు.












