జంతర్‌మంతర్ నిరసనల్లో 2,873 మంది క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్..?
ఢిల్లీ పోలీసుల షాకింగ్ రిపోర్ట్!
ఫేషియల్ రికగ్నిషన్‌లో వెలుగుచూసిన సంచలన విషయాలు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, వివిధ సంఘాలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. అయితే, ఇప్పుడు ఆ నిరసనల కంటే... వాటిపై ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాలే దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ విశ్లేషణ ఆధారంగా నిరసనల్లో పాల్గొన్న వారి వివరాలను పరిశీలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ పరిశీలనలో మొత్తం 2,873 మంది నేరచరిత్ర కలిగిన వ్యక్తులు గుర్తించినట్లు పోలీసులు పేర్కొనడం సంచలనంగా మారింది.
ఇక్కడ మరో విషయం కూడా పోలీసులు వెల్లడించారు. ఈ 2,873 మందిలో 989 మందిపై గతంలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరిలో 101 మంది హత్య కేసుల్లో, 284 మంది దోపిడీ, దొంగతనం కేసుల్లో, 92 మంది అత్యాచారం, మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే ఆరుగురిపై పోక్సో కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో చాలామందిపై ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నాయని కూడా అధికారులు చెబుతున్నారు.
ఈ వివరాలు బయటకు రావడంతో ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. విద్యార్థుల సమస్యల కోసం చేపట్టిన నిరసనల్లో నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఎలా పాల్గొన్నారు? వారు నిజంగానే ఉద్యమంలో భాగమయ్యారా? లేక గుంపులో కలిసిపోయారా? అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
సీసీ కెమెరాలే కీలకం
ఢిల్లీ పోలీసుల ప్రకారం, జూలై 20 నుంచి 25 వరకు జంతర్‌మంతర్ పరిసరాల్లో జరిగిన నిరసనలను ప్రత్యేకంగా విశ్లేషించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ ఫుటేజీ, ఇతర డిజిటల్ ఆధారాలను ఉపయోగించి పాల్గొన్న వారి వివరాలను సేకరించినట్లు తెలిపారు. అనంతరం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే పోలీసుల డేటాబేస్‌లో ఉన్న రికార్డులతో సరిపోల్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
కేసులున్న వారంతా దోషులేనా..?
ఈ గణాంకాలపై మరో కోణంలో కూడా చర్చ జరుగుతోంది. నిరసనల్లో పాల్గొన్న వారిలో నేరచరిత్ర ఉన్న వ్యక్తులు ఉండటం ఒక విషయం. కానీ వారు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని దీని వల్ల మాత్రమే నిర్ధారణ కాదు. అలాగే, పోలీసుల డేటాబేస్‌లో నమోదైన కేసులు విచారణలో ఉండవచ్చు లేదా కోర్టుల్లో పెండింగ్‌లో ఉండవచ్చు. అందువల్ల ప్రతి వ్యక్తి దోషిగా తేలిపోయారని అర్థం కాదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కావాలని సీజేపీని టార్గెట్ చేస్తున్నారని విమర్శించే వారు కూడా లేకపోలేదు.












