దేశంలో ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న పేపర్ లీక్ మాఫియాపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో... పేపర్ లీక్ గ్యాంగ్‌లకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదించారు.
అలాగే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, నిర్దిష్ట కాలవ్యవధిలో దర్యాప్తు వంటి కీలక మార్పులు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. అయితే.. పేపర్ లీక్‌ల చరిత్ర ఇప్పుడే మొదలైంది కాదు. 2015లో జరిగిన AIPMT మెడికల్ పరీక్ష పేపర్ లీక్‌తో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. ఆ తర్వాత SSC CGL, CBSE బోర్డు పరీక్షలు, రాజస్థాన్ REET, బిహార్ BPSC, ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష, తాజాగా NEET-UG వంటి అనేక పరీక్షలు పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాల్లో నిలిచాయి.
కొన్ని పరీక్షలు పూర్తిగా రద్దయ్యాయి... మరికొన్ని మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఫలితంగా కోట్లాది మంది అభ్యర్థులు మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ పేపర్ లీక్ ఆరోపణల పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ స్థాయిలో చర్యలు తీసుకున్నాయి. రాజస్థాన్‌లో REET లీక్ తర్వాత పరీక్ష రద్దు చేసి వందలాది మందిపై కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ నియామక పరీక్షను రద్దు చేసి ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టారు.
బిహార్‌లో కూడా లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించారు. అయితే.. ఈ చర్యలు జరిగిన తర్వాతే తీసుకున్నవే కానీ... లీక్‌లను పూర్తిగా అరికట్టలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం తీసుకొచ్చింది. ఈ యాంటీ-పేపర్ లీక్ బిల్లు చట్టం ప్రకారం పేపర్ లీక్ వంటి మోసాలను.. కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తున్నారు.
ఇప్పుడు తీసుకొస్తున్న సవరణలతో శిక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. సంఘటిత నేరాలకు భారీ జరిమానాలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, అవసరమైతే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి.
అయితే ప్రతిపక్షాలు మాత్రం.. కేవలం చట్టాలు తీసుకురావడం సరిపోదని, పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, భద్రత, సాంకేతిక సంస్కరణలు కూడా సమానంగా అవసరమని చెబుతున్నాయి. ఇక ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే.. పేపర్ లీక్ మాఫియాకు నిజంగానే చెక్ పడుతుందా? లేక మరిన్ని సంస్కరణలు అవసరమా? అన్నది చర్చనీయాంశంగా మారింది..












