Free Recharge: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు హల్ చల్ చేస్తున్నాయి. అవాస్తవాలు జోరుగా ప్రచారం అయిపోతున్నాయి. స్కీమ్స్ పేరిట స్కామ్స్ జరుగుతున్నాయి. వీటిని ఎవరు క్రియేట్ చేస్తున్నారో, వారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ.. ప్రజలను మాత్రం పిచ్చోళ్లను చేస్తున్నారు. ప్రభుత్వం ముద్రతో నకిలీ ప్రకటనలు తయారు చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఇది నిజమే అనుకుని నమ్మేసి.. కొందరు అమాయకులు అడ్డంగా మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఫేక్ ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇండియా డిజిటల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద దేశంలోని మొబైల్ యూజర్లు అందరికీ కేంద్రం ఉచితంగా రీఛార్జ్ చేస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ పథకం కింద కేంద్రం ఉచితంగా రూ.299 నుంచి రూ.1299 వరకు రీఛార్జ్ చేస్తుంది అనేది దాని సారాంశం. ఈ ప్రచారం కాస్త వైరల్ కావడంతో.. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ (నిజ నిర్ధారణ) విభాగం.. PIB (ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.
దేశంలోని మొబైల్ యూజర్లు అందరికీ కేంద్రం ఫ్రీగా రీఛార్జ్ చేస్తుందనే ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. రూ.299 నుంచి రూ.1299 వరకు రీఛార్జ్ వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. నిజానికి అటువంటి స్కీమే లేదని క్లారిటీ ఇచ్చింది. అలాంటి ఫేక్ ప్రకటనలు నమ్మి ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ, ఆధార్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులకు షేర్ చేయొద్దని హెచ్చరించింది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని అలర్ట్ చేసింది.












