బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యుల వివరాల ప్రకారం.. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం అంటే ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఆయన శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ ఒక్కసారిగా దెబ్బతింది. దీంతో ఆయన తీవ్ర షాక్‌కు గురైనట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయనను అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నారు. క్రిటికల్ కేర్, పల్మనరీ, కార్డియాక్, న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి మెకానికల్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయితే తక్కువ స్థాయి వెంటిలేటర్ సపోర్ట్‌తోనే ఆయన శ్వాస కొనసాగుతోందని, రక్తపోటు, గుండె స్పందన వంటి కీలక వైటల్స్ ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. కాగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయనలో న్యూరాలజికల్ స్పందన కనిపించలేదని డాక్టర్లు వెల్లడించారు.
శరీరానికి కొంతసేపు ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో మెదడుకు నష్టం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించే సూచనలు ఈఈజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీసీడీ వంటి పరీక్షల్లో కనిపించినట్లు వెల్లడించారు. ఆయన మెదడు పనితీరుపై మరింత స్పష్టత కోసం బుధవారం మరోసారి ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు.
ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టమైన అంచనా వేయగలమని పేర్కొన్నారు. అలాగే చికిత్సకు సంబంధించిన ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.












