Spirituality

Spiritual: దానం చేసే వారికి ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!..

రచన: Venu4 నిమిషాల పఠనం

సనాతన ధర్మంలో దానాన్ని అత్యంత పవిత్రమైన కర్మగా భావించారు. అయితే.. దానం చేయడం ఎంత ముఖ్యమో.. ఎలా దానం చేస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు.. మనలోని స్వార్థాన్ని కొంత తగ్గించుకుని.. అవసరంలో ఉన్న మరో మనిషికి చేయూతనివ్వడం. అందుకే సనాతన ధర్మంలో దానాన్ని అత్యంత పవిత్రమైన కర్మగా భావించారు. అయితే.. దానం చేయడం ఎంత ముఖ్యమో.. ఎలా దానం చేస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

మొదటిది.. పేరు, ప్రతిష్ఠ కోసం దానం చేయకూడదు. దానం వెనుక ఉన్న భావమే దాని విలువను నిర్ణయిస్తుందని భగవద్గీతలో కూడా చెప్పబడింది. ప్రశంసలు, ప్రచారం, గుర్తింపు కోసం చేసే దానం.. ఆధ్యాత్మికంగా దాని స్వచ్ఛతను కోల్పోతుంది. అందుకే ఎడమచేతితో చేసిన దానం కుడిచేతికి తెలియకూడదనే భావన మన సంప్రదాయంలో ఏర్పడింది.

రెండవది.. దానం తీసుకునే వ్యక్తిని ఎప్పుడూ అవమానించకూడదు. మనం ఇచ్చే వస్తువు చిన్నదైనా.. ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవం గాయపడేలా కఠినంగా మాట్లాడుతూ సహాయం చేయకూడదని పండితులు చెబుతున్నారు. దానం వెనుక కరుణ ఉండాలి.. ఆధిపత్యం కాదని అంటున్నారు.

మూడవది.. అర్హత, అవసరాన్ని గుర్తించి దానం చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం.. విద్య అవసరమైనవారికి విద్యా సహాయం.. అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య సహాయం.. ఇలా అవసరానికి సరిపోయే సహాయమే నిజమైన దానం. కేవలం ఇచ్చామనే భావన కంటే.. మన సహాయం ఒకరి జీవితంలో వెలుగు నింపుతుందనే భావనతో ఇవ్వాలని అంటున్నారు.

నాలుగవది.. పనికిరాని, మురికిగా ఉన్న వస్తువులను దానం చేయకూడదు. మనం మనకోసం ఉపయోగించని చెత్తను మరొకరికి ఇవ్వడం దానం కాదు. మనం గౌరవంగా ఉపయోగించగలిగే వస్తువును.. అవసరంలో ఉన్నవారికి గౌరవంతో ఇవ్వడమే నిజమైన దాతృత్వం అని పండితులు చెబుతున్నారు. ఐదవది.. ప్రతిఫలం ఆశించకూడదు. దానం చేసిన తర్వాత.. నేను ఇంత చేశాను అనే అహంకారం పెరిగితే.. దానం మనలోని అహంకారాన్ని తగ్గించకుండా.. మరింత పెంచుతుంది.

నిజమైన దానం మనసును తేలికపరచాలి.. భారంగా కాదు. అందుకే సనాతన ధర్మం చెప్పే దాన సూత్రం ఒక్కటే.. సామర్థ్యానికి తగ్గట్టుగా ఇవ్వాలి.. అవసరంలో ఉన్నవారికి ఇవ్వాలి.. గౌరవంతో ఇవ్వాలి.. స్వచ్ఛమైన మనసుతో ఇవ్వాలి.. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వాలి. ఎందుకంటే దానం చేతి నుంచి బయటకు వెళ్లే వస్తువు కాదు.. మన హృదయంలో పెరిగే మానవత్వం. మనం ఇచ్చేది ఎంత అన్నది కాదు.. ఏ భావంతో ఇచ్చామన్నదే ఆ దానానికి విలువను తెస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..

#Spiritual#Hindu#donations#Dharma Shastras#following
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి