స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Peddi Sudarshan Reddy: పెద్దిపై ప్రెజర్ పెట్టింది ఎవరు?

రచన: Venu10 నిమిషాల పఠనం

పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలో అలుపెరగని ఉద్యమకారుడు. 19 ఏండ్లకే దుగ్గొండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నో సమస్యలపై నేతలతో కొట్లాడిన చరిత్ర ఆయనది. బ్లాక్ కాంగ్రెస్ పేరుతో మద్దికాయల ఓంకార్‌పై ఫైట్ చేశారు.

రూ.5 కోట్ల ఆస్తి కూడా లేని మాజీ ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ అయ్యారు?

సివిల్ సప్లై, బంకర్ బెడ్స్ టెండర్స్ గోల్ మాల్‌పై కోర్టు మెట్లు ఎక్కినందుకు చిత్రహింసలు పెట్టారా?

అప్పుల్లో ఉన్నాడని తెలిసి, వట్టినాగులపల్లిలో వాసవి గ్రూప్‌తో చేతులు కలిపి వేధించారా?

కేసులో ఇరికించేందుకు పీఏలతో పాటు అనుచరులపై ఈవోడబ్ల్యూలో కేసులు పెట్టించారా?

బ్లాక్ కాంగ్రెస్ కోసం 22 ఏండ్లకే గన్ లైసెన్స్ పొందిన పెద్దికి గన్ మెన్స్ తొలగింపు, లైసెన్స్ రద్దు కక్షపూరితమా?

గ్రీన్ ఛానల్ క్లియరెన్స్‌కు వేగంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎలాంటి చెడు అలవాటు లేని సుదర్శన్ రెడ్డి స్ట్రోక్‌కు కారణమైన ఒత్తిళ్లపై..

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఇన్వెస్టిగేషన్ కథనం

తెలంగాణ ఉద్యమంలో పెద్ది పాత్ర

పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలో అలుపెరగని ఉద్యమకారుడు. 19 ఏండ్లకే దుగ్గొండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నో సమస్యలపై నేతలతో కొట్లాడిన చరిత్ర ఆయనది. బ్లాక్ కాంగ్రెస్ పేరుతో మద్దికాయల ఓంకార్‌పై ఫైట్ చేశారు. ప్రాణానికి హాని ఉందని 22 ఏండ్లకే గన్ లైసెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మూడేళ్లకు గన్ మెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి రైతు నాగలి గుర్తుతో జెట్పీటీసీగా గెలుపొంది ఫ్లోర్ లీడర్‌గా కొనసాగారు.

ఉద్యమాల ఉమ్మడి జిల్లా ఖిల్లాకు 8 సంవత్సరాలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా పని చేశారు. పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కార్యాచరణ రూపొందించేవారు. వరంగల్ రాజకీయాల్లో కేసీఆర్ నమ్మిన బంటు, ప్రధాన పిల్లర్‌గా పెద్దికి పేరుంది. జిల్లా వర్గ పోరులపై పెద్ది చెప్పిందే ఫైనల్. తండ్రి సంపాదించిన 2 ఎకరాల భూమి, హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం(అపార్ట్‌మెంట్) ఆస్తి. ఇటీవలే వరంగల్‌లో వాస్తు లోపంతో తక్కువ ధరకు వస్తుందని ఓ ఇంటిని కొనుగోలు చేశారు.

మొత్తంగా రూ.5 కోట్లకు మించి అస్తులు లేవని సన్నిహితులు చెబుతున్నారు. అత్మగౌరవం కోసం ఎవరి వద్ద ఆర్థిక లావాదేవీలు పెట్టుకునేవారు కాదని అంటున్నారు. సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా పని చేశారని చెబుతున్నారు.

పైసల కోసం ప్రెజర్ ఎక్కువయిందా?

బీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ సప్లై ఛైర్మన్‌గా పనిచేసిన పెద్దికి అందులో జరిగే టెండర్స్ స్కామ్స్‌పై అవగాహన ఉంది. అన్ని ఆధారాలు సేకరించి ఆనాటి సీఎంకు అప్పగించారని సమాచారం. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ రాగానే రూ.1,100 కోట్ల వడ్ల కొనుగోలు సిండికేట్‌పై హైకోర్టులో పిటిషన్(పిల్ నెం. 34/2024)దాఖలు చేశారు. విచారణకు వచ్చినా, ఇంకా ఫైనల్ ఆర్డర్ పెండింగ్‌లోనే ఉంది.

ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్స్‌పై కూడా హైకోర్టులో పిటిషన్(రిట్ నెం. 40073) ద్వారా జరిగిన తీరును కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రూ.17 వేలకు వచ్చే బెడ్స్‌ను రూ.33 వేలకు తయారు చేస్తున్నారని లోపాలను ఎత్తిచూపి చాలా రోజులు టెండర్స్‌లో అవినీతిపై పోరాటం చేశారు. ఇదే క్రమంలో ప్రైవేట్ వ్యవహారంపై ప్రెజర్ పెరిగింది. వట్టినాగులపల్లి వద్ద నర్సంపేట్ ప్రాంతంలోని అర్యవైశ్యులు భూములు కొనుగోలు చేశారు.

ఎన్నికల సమయంలో డబ్బులు అవసరమై వాసవి గ్రూప్‌కు అగ్రిమెంట్లు చేయించి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు అప్పుగానే తీసుకున్నట్లు చెప్పి ఎన్నికలకు వెళ్లారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయడంతో టార్గెట్ అయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వట్టినాగుల పల్లి భూమిలో సీఎం అనుచరుడిగా ఉన్న ఓ వ్యక్తి వాసవి వాళ్లతో చేతులు కలిపి డబ్బులు చెల్లించేలా ఒత్తిడి చేశారు. కోట్లాది రూపాయలు కావడం, ఆస్తులు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొన్నారు.

ఆ భూమి ఆయన కోసమే అగ్రిమెంట్ చేసి ఇచ్చామని చెప్పి సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్‌లో ఫిర్యాదు చేయించారు. రాత్రికి రాత్రి అడిషనల్ డీసీపీ పెద్దికి పీఏగా పనిచేసిన వ్యక్తిని తీసుకెళ్లి కొట్టారని ఆరోపణలు, దీంతో పాటు ఆయనకు అప్పుగా ఇచ్చిన వారందరిపై కేసులు నమోదు చేసి ఇప్పుడే ఆ డబ్బులు ఇప్పించాల్సిందిగా సుదర్శన్ రెడ్డిపై ప్రెజర్ పెంచారని సమాచారం. ఈయన పేరును కేసులో ఇరికించేందుకు నానా తంటాలు పడినా ఏ ఒక్కరు కూడా చెప్పలేదు.

పైగా డబ్బుల వ్యవహారం కావడంతో రూ.10 కోట్లకు పైగా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉండడంతో ఆయన మానసికంగా కుంగిపోయారని తెలిసింది. ప్రభుత్వం కేసులు వేయడం, మిగితా వ్యవహారాల్లో తలదూర్చడం మానుకోవాలని హెచ్చరించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులు లేరనే నేపంతో 30 ఏండ్లుగా గన్ లైసెన్స్‌తో పాటు రక్షణగా ఉండే గన్ మెన్స్‌ను తొలగించారు. కనీసం గన్ కూడా లేకపోవడం నైతికంగా ఇబ్బందికి గురిచేసినట్టు సమాచారం.

బీఆర్ఎస్ వరంగల్ ఖిల్లాకు పిల్లర్

బీఆర్ఎస్‌లో వరంగల్ జిల్లాకు పెద్ది సుదర్శన్ రెడ్డి బలమైన పిల్లర్. 2001 నుంచి బీఆర్ఎస్‌లోనే ఉండి కచ్చితమైన సమాచారాన్ని సరైన సమయంలో చేరవేసి పార్టీని కాపాడారు. ఎవరు ఎంత సమాచారం ఇచ్చినా చివరికి వరంగల్ గురించి పెద్ది రిపోర్టుయే ఫైనల్, ఉద్యమకారులను ఒకే తాటిపై నడిపించారు. ఎవరితో గొడవలు లేకుండా సమన్వయపర్చడంలో దిట్ట. అందుకే కేసీఆర్ పెద్ది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ‘‘ఎలాగైనా మా పెద్దిని కాపాడండి’’ అంటూ చేతులు ఎత్తి దండం పెట్టి డాక్టర్స్‌ను వేడుకున్నారు.

చెడు అలవాట్లు లేవు

కరోనా సమయంలో ప్రత్యేక ఐసోలెట్ సెంటర్స్ నడిపించిన పెద్ది, కరోనా బారిన పడకపోయినా ఆనాటి సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఏనాడు కనీసం మద్యం ముట్టలేదు, నాన్ వెజ్ కూడా తిన్న రోజులు కనిపించలేదు, టూర్స్ కూడా పెద్దగా తెలియదు, ఆదర్శ వివాహంతో ఆదర్శవంతమైన పొలిటిషన్‌గా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుందని అంటున్నారు. అలాంటి నాయకుడు ఫైనాన్స్ టెన్షన్స్, ప్రభుత్వంతో రాజీకి రావాలనే ఒత్తిళ్లతో ఆరోగ్యం సమస్యను పట్టించుకోలేదని అనుకుంటున్నారు.

గ్రీన్ ఛానల్ క్లియరెన్స్‌కు సీఎం ప్రత్యేక శ్రద్ధం

పెద్ది ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. బీఆర్ఎస్ నేతలు డీజీపీకి గ్రీన్ ఛానల్ ప్రపోజల్ పెట్టడంతో వెంటనే ఒకే చెప్పారని తెలుస్తోంది. అరోగ్య పరిస్థితిపై పర్సనల్‌గా సమాచారం తెప్పించుకున్నారు. 165 కిలోమీటర్లు గ్రీన్ ఛానల్ ఇవ్వడం అంటే హోంమంత్రిగా తోటి రాజకీయ నేతను కాపాడాలనే మంచి నిర్ణయమే. మాజీ, ప్రతిపక్ష నేతలకు ఇలాంటి పరిస్థితులు చాలా సార్లు అనుకూలించవు.

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

#Telangana#Political#Peddi Sudarshan Reddy#Brs#Congress#pressure
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి