తెలంగాణ

Anti-Corruption Bureau: దోచుకున్నది దొరక్కుండా దాచేదెలా?..

రచన: Venu5 నిమిషాల పఠనం

అధికారం ఆడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్న వారికి దడ మొదలైంది. అవినీతి సొమ్ము ఏసీబీ అధికారులకు దొరికితే మళ్ళీ అంతలా సంపాదించడం ఆషామాషీ వ్యవహారం కాదుకదా! అందుకే అధికారులకు దొరకకుండా ఉండటానికి ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్లు, ఆర్థిక నిపుణుల చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తుంది..

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో అక్రమాస్తుల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కోట్ల రూపాయల విలువైన భూములు, విల్లాలు, ఫ్లాట్లు, బంగారం, నగదు, లగ్జరీ కార్లు.. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల పేర్లతో పాటు బంధువులు, సన్నిహితుల పేర్లలో నమోదైన ఆస్తులు కూడా దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల వెలుగుచూసిన పలు కేసుల్లో బినామీ ఆస్తుల కోణం కూడా దర్యాప్తులో కీలకంగా మారింది.

అధికారం ఆడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్న వారికి ఈ చర్యలతో దడ మొదలైంది. అవినీతి సొమ్ము ఏసీబీ అధికారులకు దొరికితే మళ్ళీ అంతలా సంపాదించడం ఆషామాషీ వ్యవహారం కాదుకదా! అందుకే అధికారులకు దొరకకుండా ఉండటానికి ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్లు, ఆర్థిక నిపుణుల చుట్టూ తిరుగుతున్నారని.. ఆస్తులను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది..

ఇక ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో బయటపడుతున్న ఆస్తుల విలువలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అధికారిక అంచనాల కంటే మార్కెట్ విలువ అనేక రెట్లు ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన డీఎస్పీ భీంరెడ్డి కేసులో కర్ణాటకలో వ్యవసాయ భూములు, బెంగళూరులో విలువైన స్థలాలు సహా భారీ ఆస్తులు గుర్తించారు. అలాగే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖకు చెందిన నరహరిరావు, ఆర్ అండ్ బీ ఇంజినీర్ మోహన్ నాయక్, టీజీ రెడ్‌కో డీజీఎం ముత్యం వెంకటరమణ కేసుల్లోనూ కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడటం తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వరుస కేసులతో అక్రమార్జన చేసిన అధికారుల్లో ఆందోళన నెలకొన్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో బినామీల పేర్లపై ఆస్తులు నమోదు చేయడం, కుటుంబ సభ్యుల పేర్లతో సంస్థలు ఏర్పాటు చేసి ఆదాయాన్ని చట్టబద్ధంగా చూపించే ప్రయత్నాలు చేసినా.. దర్యాప్తులో అసలు యాజమాన్యాన్ని ఏసీబీ గుర్తిస్తోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు దర్యాప్తు భయంతో కొందరు బినామీలు కూడా తమకు ఆస్తులతో సంబంధం లేదంటూ వాంగ్మూలాలు ఇస్తున్నట్లు సమాచారం.

దీంతో కొందరు ఆర్థిక నిపుణులను సంప్రదిస్తూ చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు నగదు, నగలు తరలించడం, ఆస్తుల పత్రాలను ఇతరుల వద్ద ఉంచడం వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. అయితే అక్రమంగా సంపాదించిన ఆస్తులు, వాటి లావాదేవీలు, బినామీలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఒక్క ఆధారం లభించినా మొత్తం ఆస్తుల వివరాలను వెలికితీయడం సాధ్యమేనని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

మొత్తానికి.. తెలంగాణలో వరుసగా నమోదవుతున్న కేసులు అవినీతిపరుల్లో ఆందోళన పెంచుతున్నాయని తెలుస్తుంది. అక్రమ సంపాదనను దాచిపెట్టే ప్రయత్నాల కంటే, చట్టబద్ధమైన ఆదాయాన్ని ఆర్జించడమే శాశ్వత పరిష్కారమనే సందేశాన్ని ఈ పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి..

#Telangana#Hyderabad#ACB#Rides#Corrupt money
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి