నేటి సమాజంలో విద్య అంటే జ్ఞానం కాదు.. వ్యాపారం అనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు చదువుతో భవిష్యత్తు నిర్మించేవారు.. ఇప్పుడు చదువును కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్కుల కోసం పరుగు, ర్యాంకుల కోసం పోటీ, డబ్బు కోసం విద్యాసంస్థల ఆరాటం.. ఇవన్నీ విద్యా వ్యవస్థ అసలు లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. విద్య విలువలను పెంచాలా.. లేక కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కావాలా? నేటి సమాజం ముందు నిలిచిన అతిపెద్ద ప్రశ్న ఇది.
అలాగే విద్యను బోధించే పవిత్రమైన స్థానంలో ఉండి.. గురువులుగా కీర్తించబడుతున్న కొందరు.. కీచకులుగా మారడం కూడా కనిపిస్తుంది. జ్ఞానాన్ని అందించవలసిన కొందరు గురువులు అజ్ఞానంతో మూర్ఖంగా ప్రవర్తించడం విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. ఇలాంటి సంఘటన గద్వాల ప్రభుత్వ కళాశాలలో చోటు చేసుకుంది. ఒక మహిళా లెక్చర్ చేసిన పని ఒక విద్యార్థి ప్రాణం తీసింది..
గద్వాల ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి నేతిబొట్టు తరుణ్ ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులు, సహ విద్యార్థుల ఆరోపణల ప్రకారం... ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 434 మార్కులతో జిల్లాలో రెండో స్థానం సాధించిన తరుణ్‌ను, మరో విద్యార్థితో పోల్చుతూ ఓ మహిళా లెక్చరర్ తరగతి గదిలో అవమానించారని చెబుతున్నారు.
అంతేకాక, తాను అభ్యంతరం చెప్పగా మరింత కించపరిచారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తరుణ్, ఇంట్లో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తన మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను అవమానించకుండా ప్రోత్సహించాలని సూసైడ్ నోట్‌లో కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఇలాంటి సంఘటనలు సమాజానికి మాయని మచ్చ తెస్తుండగా.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆ విద్యార్థి మరణం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అలాగే నేటి చదువుల దుస్థితిని కళ్ళకు కట్టినట్టు కనిపించెలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనే ప్రశ్న కూడా సమాజం ముందు నిలిచింది. వ్యవస్థ మారాలా? వ్యవస్థను నడిపే వ్యక్తులు మారాలా? అని గమనించవలసిన అవసరం నెలకొంది..












