రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటివరకు ఎల్ నినో ప్రభావం కారణంగా తెలంగాణలో వర్షాలు కురువలేదు. ప్రస్తుతం ఎల్ నినో కు బ్రేక్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్లే రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ములుగు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం వద్ద నీటి ఉధృతి పెరిగింది. అటవీ ప్రాంతంలో గత 10 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడమే ఇందుకు కారణం. ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలపాతం ఉగ్రరూపం దాల్చింది. దీంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద గల బొగత జలపాతాన్ని వీక్షించేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. వర్షాల వలన రాళ్లు జారడం, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని భావించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వరద ఉధృతి తగ్గుముఖం పట్టి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావొద్దని, పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్త ఆదేశాలు జారీ చేశారు. టూరిస్టులు పరిస్థితిని గమనించాలని కోరారు.












