తెలంగాణను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా.. రానున్న రెండు రోజులు పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో పాటు.. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
అదే సమయంలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రాజధాని హైదరాబాద్‌లో కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతంగా ఉండనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మొత్తంగా చూస్తే... రాబోయే 48 గంటలు తెలంగాణకు అత్యంత కీలకంగా మారనున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి.. వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించడం ఎంతో అవసరమని అధికారులు పేర్కొంటున్నారు..












