చాలామంది బరువు తగ్గాలంటే తక్కువ తినడం ఒకటే మార్గం అనుకుంటారు... కానీ నిజానికి బరువు తగ్గడం అంటే కేవలం ప్లేట్‌లో ఆహారం తగ్గించడం కాదు... శరీరాన్ని సరైన విధంగా పనిచేసేలా మార్చడం. ప్రారంభంలో డైటింగ్ వల్ల బరువు కొద్దిగా తగ్గినట్లు కనిపించొచ్చు. కానీ ఎక్కువ రోజులు ఆహారం తగ్గిస్తే.. శరీరంలో కొవ్వుతో పాటు కండరాలూ తగ్గే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కండరాలు తగ్గితే మెటబాలిజం నెమ్మదిస్తుందని ఫలితంగా మళ్లీ సాధారణంగా తినడం మొదలుపెట్టగానే బరువు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.. అందుకే బరువు తగ్గాలంటే కేవలం తక్కువ తినడం సరిపోదు. ప్రతి భోజనంలో సరిపడా ప్రోటీన్ ఉండాలి. వారానికి రెండు నుంచి నాలుగు రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. ప్రతిరోజూ కనీసం ఏడు వేల నుంచి పది వేల అడుగులు నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..
వీటితో పాటు రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నాణ్యమైన నిద్ర కూడా చాలా ముఖ్యమని, అలాగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలని చెబుతున్నారు. ఇక మన జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే, హార్మోన్ల సమతుల్యత, ఇన్సులిన్ పనితీరు, మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. దీని వల్ల బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేరు కాబట్టి, జీర్ణ సమస్యలు లేదా హార్మోన్ల సమస్యలు ఉన్నాయని అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమమని పేర్కొంటున్నారు.
మరోవైపు ఆరోగ్యకరమైన శరీరం. సమతుల్య ఆహారం, సరిపడా ప్రోటీన్, క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ.. ఈ ఐదు అలవాట్లే దీర్ఘకాలికంగా ఫిట్‌గా ఉండే అసలైన సక్సెస్ ఫార్ములా అని.. ఆకలిని చంపడంతో కాకుండా.. సరైన అలవాట్లతో బరువు తగ్గించుకుంటే మేలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












