వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే కొందరు ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడటం కనిపిస్తుంది. జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్, దుమ్ము, పొగ లేదా అలర్జీల కారణంగా చాలామందికి ఈ సమస్య ఎదురవుతుంటుంది. ముక్కు మూసుకుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమే కాకుండా.. నిద్ర, ఏకాగ్రత, రోజువారీ పనులపై కూడా ప్రభావం పడుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాల ద్వారా తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గోరువెచ్చని నీరు లేదా ఇతర వెచ్చని ద్రవాలు తీసుకోవడం వల్ల గొంతు, ముక్కులోని అసౌకర్యం కొంత తగ్గవచ్చు. ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మం పలుచబడటానికి కూడా ఇది సహాయపడుతుందని అంటున్నారు. అల్లం లేదా ఇతర పదార్థాలు కలిపిన వేడి పానీయాలు కొంతమందికి ఉపశమనం ఇవ్వొచ్చు. అయితే ఇవి ఇన్ఫెక్షన్‌ను నయం చేసే చికిత్సలు కావు.
ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు సెలైన్ నాసల్ స్ప్రే లేదా సెలైన్ డ్రాప్స్ ఉపయోగించడం కూడా సహాయపడుతుంది. ఇవి ముక్కులోని శ్లేష్మాన్ని తేమగా ఉంచి, బయటకు రావడానికి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కారంగా ఉండే ఆహారంలో ఉండే క్యాప్సైసిన్ వల్ల ముక్కు తాత్కాలికంగా తెరుచుకున్నట్లు అనిపించవచ్చు. అయితే ఇది అందరికీ ఒకే విధంగా పనిచేయదు. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక ఆవిరి పట్టడం వల్ల కూడా కొందరికి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. అలాగే గోరువెచ్చని తడి గుడ్డను ముఖంపై ఉంచడం కూడా సైనస్ ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం ఇవ్వొచ్చు.. అయితే ముక్కు దిబ్బడ చాలా రోజులు కొనసాగితే.. లేదా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ముఖంలో తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే.. ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా వైద్యులను సంప్రదించాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












