Abhijeet Dipke: నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు వేధిస్తున్నారని 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) అధినేత అభిజీత్ డిప్కే ఆరోపించారు. ఈ వేధింపులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. వేధింపులు ఇలానే కొనసాగితే మరోసారి భారీ స్థాయిలో నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అభిజీత్ దీప్కే.
''విద్యార్థులపై పోలీసుల చర్యలు కొనసాగితే 'కాక్రోచ్ జనతా పార్టీ' త్వరలోనే భారీ శాంతియుత నిరసనతో స్పందిస్తుంది'' అని ఎక్స్ వేదికగా దీప్కే పేర్కొన్నారు. నిరసనల్లో పాల్గొన్న వారిని ప్రభుత్వం అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రొటెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం లేదా వేధించడం వంటి చర్యలను వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం, వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వం మానుకోవాలన్నారు.
ఇక, ఆందోళనను విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్లు కాదన్నారు అభిజీత్. CJPకి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. ఈ నిరసన ముగింపును "కేవలం ఆరంభం"గా అభివర్ణించారాయన. కాగా, నిరసనల్లో తమపై దాడులకు పాల్పడి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన వారి పట్ల పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిని అస్సలు వదలడం లేదని, వారిని గుర్తించి మరీ అరెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.












