లోక్‌సభలో అదరగొట్టిన ప్రియాంక
ఓవైపు విమర్శలు.. మరోవైపు సెటైర్లు
తాను నవ్వుతూ... స్పీకర్‌ను నవ్విస్తూ...
ఇందిరను చూసినట్టే ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ
యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగ యువత ఆందోళనలు, విద్యా వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం, విద్యార్థులపై పోలీసు చర్యల వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ఈ ప్రసంగం తర్వాత పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు ఆమె మాట్లాడిన తీరు మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గుర్తు చేసిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ప్రియాంక స్పీచ్‌లో కీలక విషయాలు
ప్రియాంక గాంధీ తన ప్రసంగంలో కేవలం పేపర్ లీక్‌ల గురించి మాత్రమే మాట్లాడలేదు. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, పరీక్షా వ్యవస్థ విశ్వసనీయత వంటి అంశాలపై దృష్టి పెట్టారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీక్‌ల వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు దెబ్బతింటున్నాయని ఆమె విమర్శించారు.
పేపర్ లీక్‌లను అడ్డుకునేందుకు చట్టం మాత్రమే తీసుకురావడం సరిపోదని, వాటికి దారితీసిన వ్యవస్థాపరమైన వైఫల్యాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు చర్యలను ప్రస్తావిస్తూ, "వాళ్లు ఉగ్రవాదులా?" అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దాడులు చేయమని ప్రధాని చెప్పారా లేక కేంద్ర హోంమంత్రి ఆదేశాలిచ్చారా అంటూ కేంద్రాన్ని నిలదీశారు.
ప్రధాని టార్గెట్‌గా విమర్శలు
ప్రధాని మోదీ టార్గెట్‌గా కూడా విమర్శలు గుప్పించారు ప్రియాంక. జెన్ జీ ని కనెక్టయ్యేందుకు మోదీ రకరకాల కెమెరా యాంగిల్స్‌లో సెల్ఫీ వీడియోలు పెడుతున్నారని అన్నారు. కెమెరా యాంగిల్స్ మార్చడం కాదు.. తన మనసులోని యాంగిల్స్ మార్చి విద్యార్థుల కష్టాలు చూడాలని కోరారు. పరీక్షా విధానాలను సంస్కరించేందుకు ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీపైనా విమర్శలు గుప్పించారు.
ఇందిరాగాంధీతో ఎందుకు పోలుస్తున్నారు..?
ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే ఆమె రూపం, హావభావాలు, మాట్లాడే తీరు చాలామందికి ఇందిరా గాంధీని గుర్తు చేస్తుంటాయి. ఈసారి లోక్‌సభలో కూడా ఆమె ధైర్యంగా, నేరుగా అధికార పక్షాన్ని ప్రశ్నించిన తీరు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇందిరా గాంధీ ప్రసంగాల్లో కనిపించే ఆత్మవిశ్వాసం, ప్రత్యర్థులను నేరుగా సవాల్ చేసే శైలి ప్రియాంకలో కూడా కనిపించిందని కాంగ్రెస్ అనుకూల వర్గాలు చెబుతున్నాయి.
రాహుల్ గాంధీతో పాటు ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్‌లో దూకుడుగా మాట్లాడటం కాంగ్రెస్‌కు రాజకీయంగా బలం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థుల సమస్యలను ముందుకు తెచ్చే ప్రయత్నం పార్టీ చేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రియాంక ప్రసంగంలోని పలు వీడియో క్లిప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో ఆమె చేసిన ప్రసంగం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.












