National

National: ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త రూల్స్ ఇవే!..

రచన: Venu5 నిమిషాల పఠనం

మధ్యతరగతి జీవితంలో.. ఒకటో తారీఖు అంటే కేవలం కొత్త నెల కాదు.. బాధ్యతలతో మొదలయ్యే పోరాటం. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది.. ఆగస్టు నెలలోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యులకు సంబంధించిన పలు కీలక నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి..

క్యాలెండర్‌లో ఒకటో తారీఖు కనిపిస్తే.. కొందరు కొత్త నెల ప్రారంభం అయ్యిందని భావిస్తారు. మరికొందరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి.. ముఖ్యంగా మధ్యతరగతి మనిషికి మాత్రం కొత్త టెన్షన్ ప్రారంభం అవుతుంది. ఇంటి అద్దె, ఈఎంఐ, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్లు, గ్యాస్, కిరాణా ఖాతాలు.. ఇలా జీతం ఖాతాలో పడకముందే ఖర్చులన్నీ క్యూలో నిలబడతాయి. ఇక అదే రోజున కొత్త రూల్స్, పెరిగిన ఛార్జీలు, మారిన ధరల వార్తలు వినిపిస్తే.. ఈ నెల ఎలా గడుస్తుందో? అనే ఆలోచనే ఎక్కువగా వెంటాడుతుంది.

అందుకే మధ్యతరగతి జీవితంలో.. ఒకటో తారీఖు అంటే కేవలం కొత్త నెల కాదు.. బాధ్యతలతో మొదలయ్యే మరో పోరాటం. అంటారు.. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది.. ఆగస్టు నెలలోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యులకు సంబంధించిన పలు కీలక నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్త ఆసక్తికరంగా మారింది. ఇక ఆర్థిక లావాదేవీలు, రైల్వే ప్రయాణాలు, రేషన్, గ్యాస్ సబ్సిడీలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

మొదటగా, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేందుకు జులై 31 చివరి తేదీ. ఈ గడువు దాటితే ఆగస్టు 1 నుంచి ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000, రూ.5 లక్షలకు మించి ఉంటే గరిష్టంగా రూ.5,000 వరకు లేట్ ఫీజు విధించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ల కోసం.. స్టేషన్ కౌంటర్లలో టోకెన్ల పంపిణీ సమయాలను మార్చింది. ఆగస్టు 1 నుంచి ఏసీ తత్కాల్ టికెట్లకు ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు, నాన్-ఏసీ తత్కాల్ టికెట్లకు ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. ప్రయాణికుల రద్దీని తగ్గించి, పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలుపుచున్నారు.

మరోవైపు తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా జులై 31 న గడువు ముగియనుంది. ప్రతి కుటుంబ సభ్యుడు స్థానిక రేషన్ దుకాణంలో ఈ-పోస్ యంత్రం ద్వారా e-KYC పూర్తి చేయాలి. గడువులోపు ప్రక్రియ పూర్తి చేయకపోతే, రేషన్ కార్డులో పేరు తొలగించడం లేదా రేషన్ సరుకులు నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు కూడా తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి.

ఆధార్ కార్డు, గ్యాస్ పాస్‌బుక్‌తో సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేస్తేనే గ్యాస్ సబ్సిడీ సజావుగా ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి, జులై 31లోపు ఈ పనులన్నీ పూర్తి చేసి, ఆగస్టు 1 నుంచి అదనపు ఇబ్బందులు, జరిమానాల బారిన పడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..

#INDIA#August#New Rules#Income Tax#Tatkal Ticket#Ration eKYC
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి