తెలంగాణ

Telangana: 22A నిషేధిత జాబితాపై ఉద్యమానికి సిద్దం.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన హరీష్ రావు!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి, అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను 22A జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఇళ్లు అమ్ముకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారని హరీశ్ రావు ఆరోపించారు.

తెలంగాణలో పొలిటికల్ వార్ పీక్ స్టేజీకి చేరుకుంటుంది. 22A నిషేధిత జాబితాపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా ప్రతిపక్షాలు ఈ అంశంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను 22A జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ నిర్వహించిన సమావేశంలో ఆయన బాధితులకు అండగా నిలిచారు.

మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి, అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను 22A జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఇళ్లు అమ్ముకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారని హరీశ్ రావు ఆరోపించారు. గతంలో రద్దైన అర్బన్ ల్యాండ్ సీలింగ్ నిబంధనలను మళ్లీ తెరపైకి తెచ్చి పట్టా భూములను 22Aలో చేర్చడం సరికాదని హితవూ పలికారు.

ప్రభుత్వం పెద్దలు 30 శాతం కమీషన్ల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూభారతి పోర్టల్ నుంచి 22A నిషేధిత జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన హరీశ్ రావు 22A జాబితాను వెంటనే పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం ఆలోచించకుండా సొంత ప్రయోజనాల కోసం ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది ప్రభుత్వమే కాబట్టి, బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా ఆ భూములను 22A జాబితా నుంచి తొలగించాలని హరీశ్ రావు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో 22A జాబితాలో భూములు ఉన్నాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పిదాలకు బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన హరీశ్ రావు.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించాలని డిమాండ్ చేశారు.

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో 22A అంశాన్ని బలంగా లేవనెత్తుతామని, ప్రజల ఇళ్లను 22A జాబితా నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన హరీశ్ రావు.. 22A జాబితాను తక్షణమే సరిచేసి, బాధిత ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ అంశంపై ఎలాంటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మంద సంజీవరెడ్డి, బోడుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుచ్చిరెడ్డి తదితర స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు..

#Telangana#Harish Rao#poguleti srinivas Reddy#cm Revanth Reddy#'22A' lands
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి