జెన్‌జీకి చుక్కలు చూపెడుతున్న స్టాక్ మార్కెట్
10 మందిలో 9 మందికి నష్టాలే
యంగ్ ఇండియాకు స్టాక్ మార్కెట్ కలిసిరాదా..?
అవగాహన లేకపోవడమే నష్టాలకు కారణమా..?
స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్.. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్.. యాప్‌లో ట్రేడ్.. గంటల్లోనే లాభం రావాలన్న ఆశ! ఇదే ఇప్పుడు కొత్త తరం ఇన్వెస్టర్ల మైండ్‌సెట్‌గా మారుతోందా? ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే పెద్దవాళ్ల వ్యవహారం. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కాలేజీ విద్యార్థులు, యువ ఉద్యోగులు, గిగ్ వర్కర్లు.. ఇలా 20–30 ఏళ్ల మధ్య ఉన్న జెన్‌జీ భారీగా మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. అయితే ఈ ట్రెండ్‌ను కేవలం ‘ఫైనాన్షియల్ అవేర్‌నెస్’గా చూడాలా? లేక ‘క్విక్ మనీ’ కోసం పెరుగుతున్న రిస్క్ కల్చర్‌గా చూడాలా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
భారత స్టాక్ మార్కెట్‌లో యువ ఇన్వెస్టర్ల వాటా గణనీయంగా పెరుగుతోంది. FY2020లో NSEలో నమోదైన ఇన్వెస్టర్లలో జెన్‌జీ వాటా సుమారు 25 శాతంగా ఉండగా.. FY2025 నాటికి అది దాదాపు 40 శాతానికి చేరింది. 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత కొన్నేళ్లలో భారత ఇన్వెస్టర్ సగటు వయసు తగ్గుతూ వస్తుండటం.. మార్కెట్ డెమోగ్రఫీలో వస్తున్న బిగ్ చేంజ్‌కు సంకేతంగా కనిపిస్తోంది. కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న వారిలోనూ యువతే పెద్ద వాటా ఆక్రమిస్తోంది.
అవగాహన ఎక్కడ..?
ఇక్కడే అసలు అలర్ట్ బెల్ మోగుతోంది. ఎందుకంటే మార్కెట్‌లోకి రావడం తప్పు కాదు. చిన్న వయసులోనే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అవగాహన పెరగడం నిజానికి మంచి పరిణామమే. కానీ ఇన్వెస్ట్‌మెంట్‌కి, ట్రేడింగ్‌కి.. ట్రేడింగ్‌కి, బెట్టింగ్‌కి మధ్య లైన్ చెరిగిపోతేనే అసలు ప్రమాదం. సోషల్ మీడియా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, టెలిగ్రామ్ గ్రూపులు, ఫిన్‌ఫ్లూయెన్సర్లు.. ఈ స్టాక్ రాకెట్, ఈ ఆప్షన్ మల్టీబ్యాగర్, ఒక్క ట్రేడ్‌తో భారీ ప్రాఫిట్.. అంటూ వచ్చే కంటెంట్ యువతను మరింత ఆకర్షిస్తోంది.
ఇది కేవలం మార్కెట్‌పై ఆసక్తి పెరగడం వల్ల మాత్రమే జరుగుతోందా? పరిస్థితులు కూడా యువతను ఈ దిశగా నెట్టేస్తున్నాయా..? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. గ్రాడ్యుయేట్ యువతలో నిరుద్యోగం ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. ఒకవైపు ఉద్యోగ భద్రత తగ్గుతుంటే.. మరోవైపు ఇల్లు, భూమి, బంగారం వంటి ఆస్తుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో జాబ్‌తో మాత్రమే వెల్త్ క్రియేట్ చేయగలమా? అనే ప్రశ్న యువతలో పెరుగుతోంది.
స్టాక్ మార్కెట్ అంటే..Plan B!
ఇక్కడి నుంచే స్టాక్ మార్కెట్ వారికి ఒక Plan Bగా కనిపిస్తోంది. జీతం పెరగడానికి సంవత్సరాలు పడుతుంది.. కానీ మార్కెట్‌లో ఒక మంచి ట్రేడ్‌తో కొద్ది గంటల్లోనే డబ్బు పెరిగినట్లు కనిపిస్తుంది. ఈ ‘క్విక్ రిటర్న్’ ఫీలింగ్‌నే సోషల్ మీడియా మరింత హైప్ చేస్తోంది. అయితే మార్కెట్‌లో లాభం ఎంత వేగంగా వస్తుందో.. నష్టం కూడా అంతే వేగంగా రావచ్చు. ముఖ్యంగా F&O, ఆప్షన్స్, ఇంట్రాడే ట్రేడింగ్ లాంటి విభాగాల్లో రిస్క్ మరింత ఎక్కువ.
ఇదే విషయాన్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్‌లో వ్యక్తిగత ట్రేడర్లలో భారీ శాతం నష్టపోతున్నట్లు సెబీ అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా 30 ఏళ్లలోపు యువత F&O ట్రేడింగ్‌లో వాటా పెరుగుతున్నప్పటికీ.. నష్టపోయే ట్రేడర్ల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. అంటే మార్కెట్‌లోకి వచ్చే యువత పెరుగుతోంది.. కానీ అదే సమయంలో రిస్క్ తీసుకునే యువత కూడా పెరుగుతోంది.
సోషల్ మీడియా నిండా ఫిన్‌ఫ్లుయెన్సర్లే...
ఇక్కడ మరో కొత్త ట్రెండ్‌ను కూడా గమనించాలి. ట్రేడింగ్ యాప్స్ ఇప్పుడు కేవలం ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్స్‌గా కాకుండా సోషల్ మీడియా యాప్స్‌లా అనిపించేలా మారుతున్నాయి. నోటిఫికేషన్లు, ట్రెండింగ్ స్టాక్స్, వాచ్‌లిస్టులు, ర్యాంకింగ్స్, రియల్‌టైమ్ చార్ట్స్.. ఇవన్నీ యూజర్‌ను మరింత తరచుగా యాప్‌లోకి తీసుకువస్తాయి. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌గా ఉండాల్సిన వ్యక్తి.. రోజూ మార్కెట్ చూసే ట్రేడర్‌గా మారే అవకాశం ఉంది. ఇందుకు ఫిన్‌ఫ్లుయెన్సర్లు కూడా కారణమే.
సోషల్ మీడియాలో ఫైనాన్స్ కంటెంట్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ప్రతి వైరల్ వీడియో వెనుక పూర్తి స్థాయి ఫైనాన్షియల్ రీసెర్చ్ ఉంటుందని భావించడం ప్రమాదకరం. ఈ స్టాక్ కొనండి, ఈ ఆప్షన్ ట్రై చేయండి, మార్కెట్ ఇక్కడి నుంచి డబుల్ అనే మాటలు వినడానికి సులభంగా ఉంటాయి. కానీ ఆ నిర్ణయం వెనుక ఉన్న రిస్క్‌ను భరించేది మాత్రం ఇన్వెస్టరే.
స్టాక్ మార్కెట్... బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ కాదు...
ఇటీవల ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్‌పై వచ్చిన కఠిన చర్యల తర్వాత మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఫాస్ట్ మనీ, స్కిల్ ఆధారిత గేమింగ్, రిస్క్ తీసుకుని గెలవాలనే మైండ్‌సెట్ పూర్తిగా మాయమవుతుందా? లేక అది మరో ప్లాట్‌ఫామ్‌ను వెతుక్కుంటుందా? కొందరు విశ్లేషకులు ఈ మానసిక ధోరణి ఇప్పుడు హై-రిస్క్ ట్రేడింగ్ వైపు మళ్లే అవకాశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ గేమ్ కాదు.. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ అంతకంటే కాదు.
జెన్‌జీ మార్కెట్‌లోకి రావడం మాత్రం ఆపాల్సిన అవసరం లేదు. నిజానికి చిన్న వయసులోనే పెట్టుబడులపై అవగాహన పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు బలమే. కానీ ఇన్వెస్ట్ చేస్తున్నానా? లేక ట్రేడ్ చేస్తున్నానా?, రిస్క్ అర్థమైందా? లేక రీల్ చూసి ఎంటర్ అయ్యానా?, లాంగ్ టర్మ్ వెల్త్ కావాలా? లేక క్విక్ మనీ కావాలా? అనే మూడు ప్రశ్నను ప్రతి యువ ఇన్వెస్టర్ తనకు తాను వేసుకోవాలి.
ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో స్క్రీన్‌పై కనిపించే గ్రీన్ కలర్ నిజమైన సంపద కాదు.. అదే విధంగా రెడ్ కలర్ కేవలం ఒక నంబర్ కూడా కాదు. అది మీ సేవింగ్స్ కావచ్చు.. మీ ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు.. మీ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బు కావచ్చు.
కాబట్టి కొత్త తరం ఇన్వెస్టర్లకు అసలు మంత్రం ఒక్కటే.. మార్కెట్‌లోకి రండి.. కానీ FOMOతో కాదు. ఇన్వెస్ట్ చేయండి.. కానీ సోషల్ మీడియా హైప్‌తో కాదు. రిస్క్ తీసుకోండి.. కానీ రిస్క్ ఏంటో తెలుసుకున్న తర్వాతే. జెన్‌జీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది.. డిజిటల్ ఫైనాన్స్‌పై యాక్సెస్ ఉంది.. ఇప్పుడు కావాల్సింది ఒక్కటే.. ఫైనాన్షియల్ డిసిప్లిన్. లేదంటే.. ఈజీగా కనిపించే క్విక్ మనీ గేమ్, భవిష్యత్తు సంపదను కరిగించే రిస్కీ గేమ్‌గా మారే ప్రమాదం ఉంది.


