తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించుకుని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. యూకే పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని, అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రతిపాదిత యూఎస్ టూర్‌కు రాజకీయ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, విద్యాపరమైన అవకాశాలపై కేంద్రం మోకాలడ్డడంపై లండన్ పర్యటనలోనే సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు, ముఖ్యమంత్రి రాష్ట్రానికి దూరంగా ఉన్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన 'కొండా ఎపిసోడ్' రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ ఇటీవల పరకాల నియోజకవర్గంలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికే మద్దతిస్తానంటూ సీఎం చేసిన ప్రకటనను ఆమె బహిరంగంగా సవాల్ చేస్తూ.. "రేవంత్ రెడ్డి వచ్చినా, ఆయన తాత వచ్చినా పరకాలలో పోటీ చేసి గెలిచేది నేనే" అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై తీవ్రంగా స్పందించిన టీపీసీసీ క్రమశిక్షణ సంఘం, మంత్రి కొండా సురేఖకు తక్షణమే వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మంత్రి సురేఖపై చర్యలకు నేతల పట్టు!
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పరకాల నియోజకవర్గంలో మంత్రి కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీలో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ అధిష్టానం నిర్దేశించిన గీత దాటి మాట్లాడటంతో పాటు, సీఎం ప్రకటనను బహిరంగంగా సవాల్ చేయడంపై పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పార్టీకి చెందిన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, నాయకులు అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే పూర్తిగా రంగంలోకి దిగారు. వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను, నియోజకవర్గాల వారీగా పార్టీ నేతల అభిప్రాయాలను ఆమె ఎప్పటికప్పుడు సేకరించి హైకమాండ్‌కు సమగ్ర నివేదిక పంపినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎవరైనా సరే క్రమశిక్షణ లైన్ దాటి ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఎంతటి వారైనా సరే క్రమశిక్షణ చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
కేంద్రం తన అమెరికా పర్యటనకు బ్రేక్ వేయడం, సొంత పార్టీలోనే మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం వంటి రెండు కీలక పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తిరిగి రావడంతో ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఈరోజు(సోమవారం) సాయంత్రం ముఖ్యమంత్రి నిర్వహించనున్న మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరును సీఎం ఏ విధంగా ఎండగడతారు? అలాగే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన అంశంపై, కొండా కుటుంబం వివాదంపై ఆయన ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


