తెలంగాణ

Telangana.. అధికారమే లక్ష్యంగా కేటీఆర్ మాస్టర్ ప్లాన్!

రచన: Venu•••6 నిమిషాల పఠనం

నియోజకవర్గం నుంచి మండల కేంద్రం వరకు.. గ్రామం నుంచి వార్డు స్థాయి వరకు బీఆర్‌ఎస్ శ్రేణులంతా కదిలి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేవలం హామీల అమలులో వైఫల్యాలే కాకుండా.. పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైన తీరును కూడా ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పార్టీల మధ్య వార్ మొదలైంది. సాధారణంగా అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ విమర్శలతో విరుచుకుపడటం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ 1000 రోజుల దగాపై బీఆర్‌ఎస్‌ సమరభేరి అంటూ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది.

ఈ క్రమంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర కమిటీతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.. ఈ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో చేసిన మోసాలు, హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు.

అధికార పీఠానికి ఆశపడిన కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను ఎన్నికల ప్రచారంలో ప్రకటించిందని.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని ప్రజలను నమ్మించిదని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ 1,000 రోజులు పూర్తవుతున్నా.. హామీల్లో ఒక్కటినీ సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం, అవినీతి, అరాచకాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ప్రతి వర్గానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, వాటి అమలు పరిస్థితిని, ప్రజలకు రావాల్సిన ప్రయోజనాలను బాకీ కార్డుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు నెలనెలా ఇస్తామన్న ఆర్థిక సహాయం ఎంత బకాయి పడిందో ప్రజలకు వివరించాలని అన్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాన్ని కూడా బీఆర్‌ఎస్ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.

ఈ క్రమంలో విద్యార్థులకు రూ.12 వేల కోట్లకు పైగా ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశాన్ని కాలేజీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. అదే విధంగా ఆటో డ్రైవర్లు, మహిళలు, రైతులు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా ప్రతి వర్గాన్ని ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మోసపోతున్న తీరును, నష్టాన్ని తెలియచేయాలని ఆదేశించారు.

ఒకే తరహా కార్యక్రమాలకు పరిమితం కాకుండా.. ఆయా వర్గాల సమస్యలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని చెప్పిన కేటీఆర్.. ఈ ఏడు రోజుల కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేషన్, జిల్లా పరిషత్ చైర్మన్లు సహా అన్ని స్థాయిల నాయకులు తప్పక పాల్గొనాలని సూచించారు.

నియోజకవర్గం నుంచి మండల కేంద్రం వరకు.. గ్రామం నుంచి వార్డు స్థాయి వరకు బీఆర్‌ఎస్ శ్రేణులంతా కదిలి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేవలం హామీల అమలులో వైఫల్యాలే కాకుండా.. పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైన తీరును కూడా ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.

#Telangana#KTR#BRS#congress#cm revanth reddy#master plan#capturing power
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి