- గతంలో ఔట్ సోర్స్ ఏజెన్సీల అవినీతి తెలిశాక విద్యా శాఖలో 1,644 పోస్టులు
- గుట్టుచప్పుడు కాకుండా నియామకాలు
- ఔట్ సోర్సింగ్‌లో 15 వేల ఘోస్ట్ ఎంప్లాయిస్ స్కాం
- రూ.1,100 కోట్ల పీఎఫ్ ఎగవేతపై స్పష్టత ఏది?
- ఇప్పుడు సమగ్ర శిక్షలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం వెనుక దందా?
- సీఎం శాఖలో మళ్లీ అదే పద్దతికి అహ్వానిస్తే ఏమనుకోవాలి?
- సొంత మండలాల సూళ్లలో జాబ్ అనడంతో అవినీతికి ఆస్కారం?
- ఒక్కొక్క ఔట్ సోర్స్ ఉద్యోగానికి రూ.2 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు
- అందుకే రైజింగ్ స్టేట్‌లో ఇంకా డ్రైనేజ్ వ్యవస్థనే నడుపుతున్నారని స్వేచ్ఛ న్యూస్ వరుస కథనాలు
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
ఔట్ సోర్సింగ్ మాఫియా ఏంటో తెలిసి కూడా?
తెలుగు రాష్ట్రాల్లో స్కూల్‌లో ఉద్యోగం అంటే నిరుద్యోగులకు ఎలాంటి ఆస్తి లేకున్నా పెళ్లిలు ఈజీగా జరిగిపోతున్నాయి.. అయితే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి యువత మొగ్గు చూపి జీవితాలను నాశనం చేసుకుంటున్నాయి. కాంట్రాక్ట్ ఎంప్లాయికి, ఔట్ సోర్స్ ఉద్యోగానికి తేడా తెలియకుండా ఎంతోమంది ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం అనేసరికి ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుందేమో అనే ఆశతో బతికేస్తారు.
కానీ.. రియాలిటీ మాత్రం అందుకు భిన్నంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న వేలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు మరింత సంచలనంగా మారుతున్నాయి. ఏటా దాదాపు రూ.600 కోట్ల మేర జీతాల చెల్లింపుల్లో ఏజెన్సీల పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పని చేయని వ్యక్తుల పేర్లతో కూడా జీతాలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల్లోనూ సుమారు రూ.1,100 కోట్ల మేర అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు, అనుమానాలు కొనసాగుతున్న సమయంలో.. సమగ్ర శిక్షలో 1,644 ఉద్యోగాలను మూడు ఏజెన్సీలకు ఔట్‌సోర్సింగ్ కింద అప్పగించడంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉద్యోగాల ముసుగులో వసూళ్లు?
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో సాగిన డబుల్ శాలరీ దందాపై అప్పటి సీఎస్ సంజయ్ జాజు నివేదికకు ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే.. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. తాజాగా సొంత శాఖలోనే మరో వివాదానికి తెరలేపింది.. ఎలాంటి బహిరంగ నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి నెల రోజుల వ్యవధిలోనే భారీగా వసూళ్లు చేశారనే ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. అయితే ఈ అవినీతి వెనుక ఎవరున్నారనేది ఆధారాలతో సహ స్వేచ్ఛ న్యూస్ త్వరలో వెలుగులోకి తీసుకురానుంది.
విజన్‌తో స్కాం?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు సమగ్ర శిక్షా అభియాన్, సీఎం ఎస్‌హెచ్‌ఆర్ఐ కింద 1,644 మంది ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, ఈ పథకం వెనుక నిరుద్యోగుల బలహీనతలను క్యాచ్ చేసుకుని 20 కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు దళారులతో చేతులు కలిపి ఒక్కో పోస్టును రూ.2 లక్షలకు అమ్ముకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
పారదర్శకతకు మంగళం.. రహస్యంగా రిక్రూట్‌మెంట్!
చంద్రబాబు ఉమ్మడి పాలన నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ పేరుతో యువతను పేదరికంలో మగ్గపెడుతున్నారు. ప్రభుత్వ పరిధిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేసినా జిల్లా విద్యాశాఖాధికారి, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ లేదా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పత్రికా ప్రకటన ఇవ్వాలని తెలుస్తోంది. అలాంటి అవకాశం లేకపోతే ప్రైవేట్ ఎజెన్సీ దక్కించుకున్న తీరునైనా ప్రకటించాలి. కానీ, ఏవీ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.
టీజీటీఎస్‌ఎల్ ద్వారా ఎంపికైన యాప్ జోన్ టెక్నాలజీస్, శివ బాలాజీ కన్సల్టెన్సీ, పాడ్యమి ఐటీ సొల్యూషన్స్ అనే మూడు ప్రైవేట్ ఏజెన్సీలకు 33 జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ విధివిధానాల ప్రకారం పారదర్శకంగా ఎంపిక జరగాల్సి ఉండగా, ఏజెన్సీలు నిబంధనలను పక్కనపెట్టి 'బ్యాక్ డోర్' పద్ధతిలో నియామక పత్రాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
డీఈవో అధికారి ఆర్డర్ కాపీ ఇచ్చే అవకాశాలు ఉండటంతో నమ్మిన ఎంతో మంది నిరుద్యోగులకు ఈ ఏజెన్సీలు రూ.2 లక్షలు చెల్లిస్తేనే ఆర్డర్ కాపీ అంటూ బ్లాక్ మెయిల్ చేశాయి. హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగం పడితేనే వేల మంది వచ్చారు. ఈ రోజుల్లో కంప్యూటర్ ఉద్యోగం అంటే విరుచుకుపడే గ్రామీణ నిరుద్యోగం ఉంది. బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ, బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ ప్రాంత అభ్యర్థులే లక్ష్యంగా తాజా దందా కొనసాగింది.
రెండు పాఠశాలలకు ఒకే ఇన్‌స్ట్రక్టర్!.. రూల్స్ ఎన్ని ఉన్నా ఏజెన్సీకి లొసుగులు తెలుసు
ప్రభుత్వ ప్రొసీడింగ్స్ ప్రకారం ఒక ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ వారంలో మొదటి 3 రోజులు ఒక పాఠశాలలో, మిగిలిన 3 రోజులు మరొక పాఠశాలలో పని చేయాలి. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, ఉద్యోగం ఇచ్చే నెపంతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన వారికి నెల జీతం రూ.15 వేల నుంచి రూ.18 వేలు అనే సరికి ఈ లంచాలు ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది.
జీవోలో ఏజెన్సీకి ఎంత ఇచ్చారో అనేది ఉంటుంది. కానీ, ఇప్పటికీ ఈ జీవో పబ్లిక్ డోమైన్‌లో లేదు. ఒక్కొక్క ఉద్యోగిపై 5 వేలు లేనిది ఈ ఔట్ సోర్స్ ఏజెన్సీలు పని చేయవు. అంటే నెలకు రూ.80 లక్షలు వాళ్లకు లాభం ఉంటుంది. ఇలా లంచాలతో వసూలు చేసినవి రూ.20 కోట్లు రిక్రూట్‌మెంట్ కంటే ముందే ఆర్డర్ కాపీ పేరుతో దందా చేస్తున్నారు. అందుకే రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజ్ వ్యవస్థ అని అనాలా వద్దా. అది కూడా సీఎం నిర్వహిస్తున్న సొంత శాఖలో ఇంతా స్కామా?
రైజింగ్ సీఎం రేవంత్ స్పందించాలి!
ఎలాంటి బహిరంగ నోటిఫికేషన్ లేకుండా ఏజెన్సీలు సాగించిన ఈ నియామకాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు ప్రతి ఉద్యోగి ఎవరెవరికి పైసలు ఇచ్చి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పొందారో విచారణ జరిపించాలని బాధితులు, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 20 వేల లోపు జాబ్ అనడంతో ఈ స్కీంలో ఉద్యోగుల స్కాంగా అక్రమంగా జరిగిన నియామకాలను రద్దు చేసి, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో డీఈవోల ద్వారా పారదర్శకంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాల వారీగా నిజమైన నిరుద్యోగులకు ఇదే జీతానికి ఉద్యోగం వచ్చేలా ఉంటే వాళ్లు సొంత మండలంలో ఈ అర్హలతో కూడా ఉద్యోగం చేస్తారు. మీరు నోటిషికేషన్ ఇచ్చినట్లు మీ ఖాతాలో వేసుకోవచ్చు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో మరోసారి ఆగం కావొద్దు.


