ఇండియన్ స్పేస్ సెక్టార్‌లో స్టార్టప్‌ల హవా
అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు
ఈ ఏడాది 400 దాటిన స్టార్టప్ కంపెనీల సంఖ్య
నేషనల్ స్పేస్ డే స్పెషల్
ఒకప్పుడు అంతరిక్షం అంటే ఇస్రో.. రాకెట్లు అంటే ఇస్రో.. ఉపగ్రహాలు అంటే ఇస్రో. కానీ ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది. భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు భారీగా అడుగుపెడుతున్నాయి. ఈ మార్పుకు కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా మద్దతు ఇస్తోంది. 2026లో భారత స్పేస్ స్టార్టప్‌ల సంఖ్య 400 దాటింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. మార్పు ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పడానికి.
నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ 20 భారతీయ స్పేస్ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈవోలతో సమావేశమయ్యారు. అంతరిక్ష సాంకేతికతను కేవలం రాకెట్లు, ఉపగ్రహాల వరకే పరిమితం చేయకుండా.. సామాన్యుల జీవితాలను మెరుగుపరిచేలా ఉపయోగించాలని ఆయన సూచించారు. భారత స్టార్టప్‌లు దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలని కూడా పిలుపునిచ్చారు.
భారత్.. స్పేస్ గేమ్!
ఇక్కడే భారత్ కొత్త గేమ్ మొదలవుతోంది. గతంలో ప్రైవేట్ సంస్థలు ఇస్రోకు సరఫరాదారులుగా లేదా భాగస్వాములుగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు సొంతంగా రాకెట్లు, ఉపగ్రహాలు, ప్రొపల్షన్ సిస్టమ్స్, స్పేస్ డేటా, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధ్రువ స్పేస్, డిజిటారా వంటి కంపెనీలు ఈ మార్పుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పులు కూడా ఈ వేగానికి కారణం. 2020లో ప్రైవేట్ రంగానికి స్పేస్ సెక్టార్‌ను తెరవడం, IN-SPACe ఏర్పాటు, 2023 స్పేస్ పాలసీ వంటి చర్యలు ప్రైవేట్ పెట్టుబడులకు మార్గం సుగమం చేశాయి. ఇస్రో కూడా ప్రైవేట్ పరిశ్రమలకు అంతరిక్ష కార్యకలాపాల్లో భాగస్వామ్యం కల్పించే దిశగా పనిచేస్తోంది. దీంతో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి.
స్పేస్ సెక్టార్ భవిష్యత్ బ్రాహ్మాండం...
భారత స్పేస్‌టెక్ స్టార్టప్‌లు 2026లో ఇప్పటికే వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. మరోవైపు దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, వచ్చే దశాబ్దంలో 40–45 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. స్టార్టప్‌లు పెరిగినంత మాత్రాన భారత్ వెంటనే అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడగలదా? అంతరిక్ష రంగంలో భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత, పరీక్షా మౌలిక సదుపాయాలు, స్పేస్-గ్రేడ్ విడిభాగాల తయారీ వంటి అంశాల్లో ఇంకా సవాళ్లు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు ఉపగ్రహాల తయారీని పెంచుతున్నప్పటికీ, మౌలిక సదుపాయాల కొరత, నియంత్రణ ప్రక్రియలు, అధిక కాంపోనెంట్ ఖర్చులు వంటి సమస్యలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అయినా ఫ్యూచర్ మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇస్రో ఇక ఒంటరిగా భారత అంతరిక్ష ప్రయాణాన్ని నడిపించే సంస్థగా కాకుండా.. ప్రైవేట్ రంగానికి టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, పరిశోధనలో భాగస్వామిగా మారుతోంది. అంటే భవిష్యత్తులో భారత్ నుంచి ఒకటి కాదు.. అనేక ప్రైవేట్ రాకెట్ కంపెనీలు, శాటిలైట్ కంపెనీలు, స్పేస్ డేటా సంస్థలు ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడే అవకాశం ఉంది.
భారీగా ఉపాధి అవకాశాలు
మరో కీలక అంశం ఉద్యోగాలు. స్పేస్‌టెక్ రంగం విస్తరిస్తే ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు పెరగవచ్చు. అంతరిక్ష రంగం ఇక శాస్త్రవేత్తలకు మాత్రమే సంబంధించిన రంగం కాదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చంద్రుడిపై అడుగుపెట్టిన భారత్ ఇప్పుడు మరో దశలోకి వెళ్తోంది. ప్రభుత్వ సంస్థ నుంచి ప్రైవేట్ సంస్థల వరకు.. రాకెట్ నుంచి స్పేస్ డేటా వరకు.. ప్రయోగాల నుంచి కమర్షియల్ బిజినెస్ వరకు.. భారత అంతరిక్ష రంగం రూపం మారుతోంది. ఈ మార్పు విజయవంతమైతే, రాబోయే దశాబ్దంలో మేడిన్ ఇండియా రాకెట్లు, ఉపగ్రహాలు ప్రపంచ మార్కెట్‌లో కనిపించడం అసాధ్యమేమీ కాదు.


