నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. అలాగే పార్టీ నేతలకుహెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ వచ్చాయని.. అలాగే జిల్లాలో దాదాపు 600 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు జరుగుతున్నాయని పేర్కొన్నారు..
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, బోనస్ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి కృషి చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. త్వరలో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, ఆర్మూర్‌లో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.. ఇక కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలున్నాయని చెప్పిన ఆయన.. హద్దులు దాటి సీఎం లేదా పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని, బహిరంగంగా మాట్లాడితే క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కాంగ్రెస్‌లో నేతల మధ్య బహిరంగ వ్యాఖ్యలు, అసంతృప్తులు, వర్గ విభేదాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో.. మహేశ్ గౌడ్ హెచ్చరికలు పార్టీ అంతర్గత పరిస్థితులపై చర్చాంశనీయంగా మారాయి. ఇదే సమయంలో నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు.
సెప్టెంబర్‌లోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. భర్తీ చేయబోయే పదవుల్లో 80 శాతం గతంలో పార్టీ కోసం కష్టపడ్డ పాత కార్యకర్తలకు కేటాయిస్తామని, మిగిలిన 20 శాతం కొత్త నేతలకు అవకాశం ఇస్తామని చెప్పారు. గతంలో పదవుల కేటాయింపులో చిన్న చిన్న తప్పిదాలు జరిగాయని అంగీకరించిన ఆయన.. ఈసారి క్రమశిక్షణ, నిబద్ధత, కష్టపడే మనస్తత్వం ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
కార్యకర్తల త్యాగాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ పై విమర్శలు గుప్పించిన మహేశ్ గౌడ్.. ఇందూరును స్మార్ట్ సిటీగా మార్చడంలో జాతీయ పార్టీ విఫలమైందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు.
మొత్తానికి సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవుల భర్తీతో పాత కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలవుతుంది? అంతర్గత విభేదాలకు కాంగ్రెస్ నాయకత్వం చెక్ పెడుతుందా? లేదా? అనేది చూడాలి..


