ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ లో ఉన్న ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్న అధికారులు.. బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
అయితే ఈడీ అధికారులు కాసేపట్లో కారుమూరి నాగేశ్వరరావును విచారించనున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే కేసులో ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌ను కూడా జూన్ 16న ఈడీ అరెస్ట్ చేసింది. సునీల్‌కు లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టుల్లో కీలక పాత్ర ఉందని, దాదాపు 28 కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌లు అందినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో లిక్కర్ కు సంబంధించిన స్కామ్ లో మరికొందరి పేర్లు బయటపడే ఛాన్సున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ కేసులో మరో కీలక పేరు రాజ్ కసిరెడ్డి. ఈడీ ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ జూన్‌లో అరెస్ట్ చేసింది. గతంలో ఏపీ సీఐడీ కూడా ఆయనను అరెస్ట్ చేసింది. అలాగే అప్పటి ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. లిక్కర్ ఆర్డర్లు, సరఫరా, బ్రాండ్ల కేటాయింపుల్లో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు సిట్ ఆరోపించింది. అంతేకాదు.. ఈడీ ఇప్పటికే ఈ కేసులో 441 కోట్ల 63 లక్షల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
అలాగే దర్యాప్తులో దాదాపు 1,048 కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌ల మనీ ట్రయిల్‌ను గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. కాగా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరికి చేరింది? కాంట్రాక్టులు ఎలా దక్కాయి? రాజకీయ పలుకుబడి ఎక్కడ ఉపయోగపడింది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు బ్యాంకు లావాదేవీలు, షెల్ కంపెనీలు, కాంట్రాక్టు ఒప్పందాలు, ఆస్తుల కొనుగోళ్లు, హవాలా మార్గాల్లో ఈ మని అందినట్టు అనుమానిస్తుంది.
అంతేకాదు.. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులను మళ్లీ విచారిస్తూ.. వారి వాంగ్మూలాల ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇవ్వడం, సోదాలు నిర్వహించడం, ఆస్తులు అటాచ్ చేయడం వంటి చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికి.. కారుమూరి అరెస్ట్‌తో ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయన్న చర్చ ఆసక్తికరంగా మారింది!.. ఇక దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారన్న విషయం తెలిసిందే..


