Zombie Reddy-2 (Nxt Lvl): చైల్డ్ ఆర్టిస్ట్‌గా భారీ చిత్రాల్లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా..హీరోగా మారి చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకుంటున్నాయి. జాంబీ రెడ్డి, మిరాయ్ లాంటి సినిమాలతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఓ పెద్ద హీరో సినిమా రిలీజవుతుంటే ఎలాంటి అంచనాలు, జనాల్లో ఆతృత ఉంటాయో అవన్నీ తేజ సజ్జా సినిమాకి ఉంటున్నాయి.
నేడు యువ కథానాయకుడు తేజ సజ్జా పుట్టినరోజు. ఈ సందర్భంగా జాంబీ రెడ్డి చిత్రానికి సీక్వెల్ జాంబీ రెడ్డి నెక్స్ట్ లెవల్ చిత్రాన్ని ప్రకటించి శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఇక, ఈ సినిమాకి సుపర్ణ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక, తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో, పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సుపర్ణ వర్మ ఇంతకముందు ది ఫ్యామిలీ మేన్ 2, రానా నాయుడు, హాక్ లాంటి సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. మొదటి భాగం జాంబీ రెడ్డి చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా..ఈసారి సీక్వెల్ మాత్రం సుపర్ణ వర్మ కి వెళ్ళడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జాంబీ రెడ్డి 2 ని టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, ప్రశాంత్ వర్మ కలిసి నిర్మిస్తున్నారు. అలాగే, కథ-కథనాలలో భాగమయ్యాడు ప్రశాంత్ వర్మ.
కన్నడ సీనియర్ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంజయ్ కపూర్ కూతురు షనాయ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సంగీత దర్శకుడిగా గౌరి హరి పనిచేయబోతున్నాడు. అయితే, మొదటి భాగం ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టైల్‌తో మంచి విజయాన్ని అందుకుంది. కానీ, ఇప్పుడు సీక్వెల్ కి దర్శకుడు మారాడు. మరి, ఈ మార్పు..ప్రయోగం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.


