తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు నేటి అర్ధరాత్రి నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో తమకు ఏటా రూ.12 వేల ఆర్థికసాయం చేస్తామని నాడు రేవంత్ రెడ్డి ప్రకటించారని..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ముఖ్యమంత్రి ఇంతవరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడుతున్నారు.రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం కారణంగా ఆటోలు ఎవరూ ఎక్కడం లేదని ఫలితంగా తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సీఎన్‌జీ, డీజిల్ ధరలు పెరగడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని, వెంటనే తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆటో డ్రైవర్ యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది.
దీనిపై తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీంతో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లు తలపెట్టిన నిరవధిక బంద్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమ్మెల వల్ల సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆదివారం హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
2015 తర్వాత రాష్ట్రంలో ఆటో చార్జీలు పెరగలేదని మంత్రి గుర్తుచేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటోఛార్జీల పెంపుపై అధ్యయనం చేయడానికి త్వరలో ప్రత్యేక కమిటీని వేస్తామన్నారు.ఇందులో ఆటో కార్మికుల ప్రతినిధులతో పాటు రవాణా శాఖ అధికారులను భాగస్వామ్యం చేస్తామన్నారు. అదేవిధంగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం జరిగిందని, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసి బోర్డును అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్ల ఇబ్బందులను సైతం పరిగణనలోకి తీసుకుని సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.
డీజిల్ వెర్షన్, పాత ఆటోలను స్క్రాప్ చేసి కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే డ్రైవర్లకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందజేస్తుందని మంత్రి ప్రకటించారు.దశలవారీగా నగరంలోని అన్ని ఆటోలను ఈవీలుగా మారుస్తామని, అదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రోఫిట్‌మెంట్ (గ్రీన్ ఎనర్జీ మార్పిడి) కోసం త్వరలోనే ఒక నూతన పథకాన్ని తీసుకురానున్నట్టు మంత్రి పొన్నం ప్రకటించారు.


