తెలంగాణ

BRS : ఆరోగ్య శ్రీపై రేవంత్ ఉత్తమాటలు.. 18 నెలలు జీతాలివ్వకపోతే ఎలా బతకాలి? : హరీశ్ రావు

రచన: Kumar••6 నిమిషాల పఠనం

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరోసారి మండిపడ్డారు.సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందడం లేదని.. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరోసారి మండిపడ్డారు.సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందడం లేదని.. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో హరీశ్ రావు ఆసక్తికర పోస్టు పెట్టారు.

‘ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో వైఫల్యం. సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ వైఫల్యం!.ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి?’ అంటూ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తూర్పారబట్టారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల నిధులు విడుదల కాకపోవడంతో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. నెలల తరబడి జీతాలు లేకుండా సిబ్బంది ఎలా బతకాలి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి?అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి నెలా 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మరి మీ సమాధానం ఏమిటి? అని అడిగారు.

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకీ 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ నిధులు ఒక రూపాయి కూడా ఎందుకు విడుదల కాలేదని, దాదాపు రూ.24 కోట్లు ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆసుపత్రుల నిర్వహణ, రోగుల సంరక్షణ, మందులు, వైద్య పరికరాలపై ప్రభావం పడ్డది, సేవలు అందడంలేదన్నారు.

ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోతే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది జీతాలు, మందులు, పరికరాల కొనుగోళ్లు, ఆసుపత్రి నిర్వహణపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించారని, కానీ అది ప్రకటనలకే పరిమితమయ్యిందని విమర్శించారు.

ఆరోగ్యశ్రీ కవరేజీ పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. మరోవైపు రోజురోజుకూ ఆరోగ్యశ్రీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, బకాయిలు పేరుకుపోతూ, ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడమే ఆసుపత్రులకు భారంగా మారితే.. చివరకు నష్టపోయేది ఎవరు? పేద రోగులే కదా!.. పేద ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్యశ్రీకి నిధుల కొరత ఎందుకు వచ్చింది? అని అడిగారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఎలాంటి తేడా చూపకుండా, సీనియారిటీ, ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది జతాలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలని, పేదల ప్రాణాధారమైన ఆరోగ్యశ్రీని కాపాడాలని హితవుపలికారు.

https://x.com/BRSHarish/status/2091413456239186205?s=20

#harishrao#arogya sri#funds#pending#brs#revanth reddy#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి