జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రాత్మక చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ కావడం, ఆదిత్య-ఎల్1 ద్వారా సూర్యుని అన్వేషణ జరగడం వంటి ఘనతలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అంతరిక్ష రంగంలో భారతదేశ భవిష్యత్తుకు సరికొత్త అవకాశాలను తెరుస్తున్న అద్భుతమైన స్పాడెక్స్ (SPADEX) డాకింగ్ ప్రదర్శనల వరకు ఇస్రో, మన శాస్త్రవేత్తలు సాధించిన అసాధారణ విజయాలను దేశం గర్వంగా వేడుక చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం ఒక నూతన శకంలోకి ప్రవేశించిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ప్రభుత్వ విధానపరమైన సంస్కరణలు, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంపు, 'ఇన్-స్పేస్' (IN-SPACe) వంటి సంస్థల ఏర్పాటు వంటివి దేశ జాతీయ అంతరిక్ష ఆశయాలకు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. స్టార్టప్‌లు, పరిశ్రమలు, పరిశోధకులు, యువ ఆవిషకర్తల కోసం ఇవి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశపు మొట్టమొదటి ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. మన దీర్ఘకాలిక 'స్పేస్ విజన్ 2047' లక్ష్యాలలో భాగంగా భవిష్యత్తులో స్వదేశీ 'భారతీయ అంతరిక్ష స్టేషన్' రూపుదిద్దుకుంటుండగా, రాబోయే కాలంలో ఇస్రో చేపట్టబోయే ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వివరించారు. దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేస్తూ భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్న ప్రతి శాస్త్రవేత్తకు, ఇంజినీర్‌కు, సాంకేతిక నిపుణుడికి, యువ మేధావులకు ఆయన ప్రత్యేకంగా వందనాలు తెలిపారు.


