కొందరు ఎదుటి వారి మీద అమితమైన స్నేహాన్ని, ప్రేమాభిమానాలను చూపిస్తారు. వారికి ఏదైనా జరిగిందంటే అస్సలు తట్టుకోలేరు. వారి మధ్య ఉండే అండర్ స్టాండింగ్, స్నేహభావన,అప్యాయతలే కారణమని కొందరు చెబుతున్నారు. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా మారినక్రమంలో ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఏదైనా జరిగితే..కుమిలి క్రుంగిపోయి వారు సైతం ఈ లోకాన్ని వీడాలని ఆలోచనలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇదివరకు చాలానే జరిగాయి. తల్లి మరణించిందని కొడుకు, భర్త చనిపోయాడని భార్య, పేరెంట్స్ లేరని పిల్లలు ప్రాణాలు విడిచిన ఘటనలు అనేకం ఉన్నాయి.
తాజాగా ఇద్దరు ఫ్రెండ్స్ జీవితంలో ఎదురైన ఇబ్బందులు, ఒత్తిడితో కూడిన జీవితాన్ని ఇకముందు లీడ్ చేయలేమని భావించి ఆత్మహత్యకు యత్నించారు. ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. యూపీ రాష్ట్రం భదోహికి చెందిన కవిత, సాధన ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నారు. 10వ తరగతి వరకు కలిసి పెరిగిన వీరిద్దరూ ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకుంటూ ఉండేవారు.
ఈ నేపథ్యంలోనే సాధనకు రెండు నెలల కిందట తనకు ఇష్టంలేని వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. భర్త తీరు నచ్చకపోవడంతో నెలరోజులుగా సాధన ఇంట్లోనే ఉంటోంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైంది.మరోవైపు కవిత ఓ వ్యక్తిని ప్రేమించగా కుటుంబ సభ్యులు అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించారు. దీంతో కవిత సైతం తీవ్ర ఒత్తిడికి లోనైంది.
ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకున్నవీళ్లు.. ఎలాగూ తమకు నచ్చిన జీవితం దక్కలేదని, కారణాలు వేరైనా కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో విషపుగులికలు మింగారు. అదే రోజు సాయంత్రం సాధన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా కవిత చికిత్స పొందుతూ మరణించగా.. ప్రస్తుతం సాధన ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.


