తెలంగాణ

Telangana: రేవంత్ సర్కార్ కు కొత్త సవాలు.. హాట్‌టాపిక్‌గా మారుతున్న కాంగ్రెస్ రాజకీయాలు!..

రచన: Venu••6 నిమిషాల పఠనం

మంత్రిపై ఎమ్మెల్యేలు నేరుగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం, దానికి ప్రతిగా మంత్రి పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడం.. ఈ వ్యవహారాన్ని సాధారణ అంతర్గత వివాదం కంటే పెద్ద రాజకీయ అంశంగా మార్చింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలంలో ఎలాంటి విభేదాలు బయటికి రావడం లేదు ఏంటని ఆశతో చూస్తున్న ప్రతిపక్షాలకు.. ప్రస్తుతం అధికార పక్షంలో నెలకొన్న పరిస్థితులు అనుకూల మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అంటేనే అసంతృప్తులకు, విభేదాలకు కేరాఫ్ అన్న విషయం గత పరిస్థితులను గమనిస్తే తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం అధికారపక్షం వైపు వీస్తున్న ప్రతికూల పవనాలు సీఎం సీటుకే ఎసరు పెట్టినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తాజాగా మంత్రి కొండా సురేఖ పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తనకేమి సంబంధం లేదని మాట్లాడిన సురేఖా.. ఇప్పుడు కొత్త రాగం అందుకుంది.

తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. తనపై బహిరంగంగా విమర్శలు చేయిస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి పార్టీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపకం, నియోజకవర్గ రాజకీయాలు, నేతల మధ్య ఆధిపత్య పోరు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.

కానీ ఇప్పుడు మంత్రిపై ఎమ్మెల్యేలు నేరుగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం, దానికి ప్రతిగా మంత్రి పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడం.. ఈ వ్యవహారాన్ని సాధారణ అంతర్గత వివాదం కంటే పెద్ద రాజకీయ అంశంగా మార్చింది. ముఖ్యంగా కొండా సురేఖ తనను సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా పేర్కొంటూ.. తనపై వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం పార్టీ విలువలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక అసలు వ్యూహకర్త ఎవరు? కొందరు ఎమ్మెల్యేలు స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక పార్టీ అంతర్గతంగా ఉన్న ఏదైనా శక్తి వారికి దిశానిర్దేశం చేసిందా? అనే అంశంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఈ వివాదం కేవలం నేతల మధ్య మాటల యుద్ధంగా కాకుండా పార్టీ అంతర్గత రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

ఒకవైపు పాలనపై ప్రభుత్వం దృష్టి పెడుతుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతల మధ్యే విభేదాలు బహిర్గతం కావడం కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారిందని తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలో అంతర్గత కలహాలు ఎంత ఎక్కువగా బయటపడితే.. ప్రతిపక్షాలకు అంత రాజకీయ అవకాశం లభిస్తుంది. అందుకే ఇప్పుడు సురేఖ ఫిర్యాదు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే కీలకం. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? అందరినీ పిలిచి రాజీ ఫార్ములాతో వివాదాన్ని ముగిస్తుందా? లేక ఈ వ్యవహారం మరింత ముదిరి కొత్త రాజకీయ శిబిరాలకు దారితీస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

మొత్తంగా చూస్తే.. కొండా సురేఖ ఫిర్యాదు ఒక వ్యక్తిగత వివాదంగా కనిపించినప్పటికీ, దాని వెనుక అధికార కాంగ్రెస్‌లోని అంతర్గత అసంతృప్తి, ఆధిపత్య పోరు, నాయకత్వ నియంత్రణ వంటి అనేక రాజకీయ కోణాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ అంశం కేవలం ఓ మంత్రి, కొందరు ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వ్యక్తిగత వివాదమా? లేక అధికార పార్టీలో చాలాకాలంగా కొనసాగుతున్న అంతర్గత అసంతృప్తికి బహిరంగ రూపమా? అనే చర్చలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి..

#Telangana#Konda Surekha#CM Revanth Reddy#Congress#TPCC#MLAs politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి